Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాలుగు లేబర్‌కోడ్‌లు రద్దయ్యేవరకు పోరాడుతాం

నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దయ్యేవరకు పోరాడుతాం

- Advertisement -

పాలకవర్గం కార్మిక పక్షం వైపు ఆలోచన చేయాలి
తుర్కయంజాల్‌లో విజయవంతంగా ముగిసిన తెలంగాణ మున్సిపల్‌
వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు
ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక
130 మందితో రాష్ట్ర కమిటీ, 29 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
రాష్ట్ర అధ్యక్షులుగా పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా జనగాం రాజమల్లు
పలు తీర్మానాలకు ఆమోదం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రాలరాస్తూ తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడుతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. లేబర్‌ కోడ్‌లకు రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. కేంద్రంలోని బీజేపీకి మద్ధతుగా నిలిచాయని, యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు బుధవారం విజయవంతంగా ముగిసాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ పట్టణ కేంద్రంలో రాగన్నగూడలోని ఎన్‌ఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీలో చలసాని వారి కళ్యాణ మండపంలో మంగళవారం ప్రారంభమైన మహాసభలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. బుధవారం ప్రతినిధుల సభ ప్రారంభానికి ముందు సీనియర్‌ కార్మికురాలు దుర్గమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. ప్రతినిధులు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. యూనియన్‌ మూడేండ్ల కాలంలో నిర్వహించిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించేందుకు మహాసభ తీర్మానాలు చేసింది. అనంతరం 130మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కొంతమంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతం, కనీస వేతనం అమలు చేయకుండా బీజేపీ కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే కార్మికులకు కనీస వేతనం అమలు అవుతుందని ఆశపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే కొత్త సీసాలో పాత సారాయి పోసిన చందంగా ఉందన్నారు. ఏపీలో రూ.21 వేల వేతనం సాధ్యమవుతుంటే.. తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. సీఎం దగ్గర ఉన్న 2వ పీఆర్‌సీ ఫైల్‌ను అమోదించాలన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు దాసోహం చేస్తూ కార్మిక చట్టాలను రద్దు చేస్తోందన్నారు. పారిశుధ్య కార్మికుల పోరాటం అంటే సామాజిక న్యాయ పోరాటమే అని అన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ మాట్లాడుతూ.. సీఐటీయూ పోరాటంతోనే కార్మికుల వేతనాలు పెరుగుతాయన్నారు.

తీర్మానాలు
‘మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌ ఉద్యోగ భద్రత కల్పించాలని, షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్‌ డ్రాఫ్ట్‌ కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కార్మికులకు ఇచ్చే జీతాలు జీవో నెంబర్‌ 60 ప్రకారం కేటగిరీల వారీగా నిర్ణయించాలన్నారు. ప్రమాదాల వల్ల మరణిస్తున్న కార్మికులకు రూ. 20 లక్షలు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మున్సిపల్‌ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్మికునికి ఇందిరమ్మ ఇండ్లు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని తీర్మానించారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని, పని ప్రదేశాల్లో మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని, లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పీఓఎన్‌హెచ్‌) 2013ను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల కార్యాలయాల్లో పటిష్టంగా అమలు చేయాలని మహాసభ తీర్మానించింది.

130మందితో నూతన రాష్ట్ర కమిటీ
నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అధ్యక్షులుగా పాలడుగు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శిగా జనగం రాజమల్లు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పాలడుగు సుధాకర్‌, కోశాధికారిగా అశోక్‌తో పాటు 29 మంది ఆఫీస్‌ బేరర్స్‌ 130 మందితో రాష్ట్ర కమిటీని మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -