నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) నుంచి లభించిన బలమైన మద్దతు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సానుకూల సంకేతాల నేపథ్యంలో ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ 340 పాయింట్లు (0.41 శాతం) పెరిగి 82,945 వద్దకు చేరుకుంది. అలాగే, నిఫ్టీ కూడా 105 పాయింట్లు (0.41 శాతం) లాభపడి 25,428 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఈరోజు ట్రేడింగ్‌లో రంగాలవారీగా చూస్తే, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు చెరో 0.8 శాతం లాభపడి ముందున్నాయి. నిఫ్టీ రియల్టీ సూచీ కూడా 0.6 శాతం పెరిగింది. అయితే, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో నిఫ్టీ ఐటీ సూచీ 0.14 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభపడగా.. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లకు ముఖ్యంగా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. నిన్న దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) ఏకంగా రూ. 4,650 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 68 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొన్నారు.