కుటుంబసభ్యుల్లో భిన్న స్వరాలు
మేడారం ఫైల్స్ సీఎం పేషీకి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పక్కనపెట్టిన మాజీ ఓఎస్డీకి మంత్రి కొండా అండగా ఉండటంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రి ఓఎస్డీ సుమంత్‌ను పలు ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయడానికి మంత్రి ఇంట్లో ఉన్న సుమంత్‌ను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన మఫ్టీ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకొని వాగ్వివాదానికి దిగడం, ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ మాట్లాడిన వీడియో బయటకు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి, సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అంతేగాకుండా మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తన కారులో తీసుకువెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తించడం, నేరుగా మంత్రి కుమార్తె సీఎంపైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే, మంత్రి కుమార్తె సుస్మిత తీవ్ర ఆరోపణలు చేయగా, గురువారం ఉదయం హనుమకొండలో ‘మీడియా’తో మాట్లాడిన మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సీఎం రేవంత్‌తో ఎలాంటి విభేధాలు లేవని, తాను ఎవ్వరినీ టార్గెట్ చేయలేదని, తనకు ఎవరూ టార్గెట్ కాదని, ఏదున్నా సీఎంతో మాట్లాడుతానని, తన కుమార్తె ఏమీ మాట్లాడిందో తెలియదని, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని వివరణ ఇచ్చారు. మంత్రి భర్త ఒకలా, కుమార్తె మరోలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
మేడారం పనులు ఆర్‌అండ్‌బీకే
మేడారం జాతరలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులను రహదారులు, భవనాల శాఖకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దేవాదాయ శాఖకు చెందిన పలు ఫైళ్లను సైతం సీఎం తన పేషీకి తెప్పించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.
సుమంత్‌ను కాపాడాల్సిన అవసరమేంటి..?
మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను తొలగించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వద్ద సుమంత్‌పై వచ్చిన ఆరోపణలే కారణమని తెలుస్తోంది. ఓఎస్డీ తన పరిమితులను దాటి పలువురు పారిశ్రామిక వేత్తల నుంచి భారీ వసూళ్లకు, బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలున్నాయి. మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం నడిపే అవకాశం లేదని, ఒకవేళ మంత్రికి తెలియకపోతే సుమంత్‌ను పోలీసుల నుంచి కాపాడాల్సిన అవసరమేముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి కొండా సురేఖ గురువారం వరంగల్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
మీనాక్షితో ‘కొండా’ భేటీ..
ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కొండా సురేఖ, తన కుమార్తె సుస్మితతో కలిసి భేటీ అయ్యారు. గత రెండ్రోజులుగా తన శాఖలో జరిగిన పరిణామాలతోపాటు మీడియాతో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై వివరణనిచ్చారు. సీఎం, మంత్రులపై చేసిన ఆరోపణలపై ‘కొండా’ వివరణనిచ్చుకునే అవకాశముంది. ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖతో మాట్లాడుతారని, సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోనూ ఆమో సమావేశమయ్యారు.