Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపక్కనే కృష్ణమ్మ ఉన్నా.. నీళ్లు రాలే

పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. నీళ్లు రాలే

- Advertisement -

– గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసమే పనిచేసింది
– పేదప్రజల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి
– మక్తల్‌ పెద్దచెరువులో చేప పిల్లలు విడుదల
నవతెలంగాణ- మక్తల్‌

పక్కనే కృష్ణమ్మ ఉన్నా మక్తల్‌ ప్రాంతానికి నీళ్లు రాలేదని, గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలోని పెద్ద చెరువు మిని ట్యాంక్‌బండ్‌లో శుక్రవారం ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి మంత్రులు చేప పిల్లలను వదిలారు. అనంతరం మినీ ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన బహిరంగసభలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య, క్రీడలు శాఖమంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. పక్కన కృష్ణమ్మ పారుతున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మక్తల్‌ ప్రాంతానికి నీళ్లు రాలేదన్నారు. గత పాలకులు మైక్‌ పట్టుకున్న ప్రతిసారీ జీవో కాగితాలు చూపించి కాలం వెళ్లదీశారు తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని నారాయణపేట- మక్తల్‌-కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకులు పక్కనే ఉన్న ప్రాజెక్టు వదిలేసి.. ఇక్కడి నీళ్లను శ్రీశైలం దగ్గర ఏలూరు బ్యాక్‌ వాటర్‌కి తరలించేలా చర్యలు చేపట్టారని అన్నారు. మక్తల్‌కి 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణమ్మ ఉంటే.. 330 కిలోమీటర్ల దూరం టెల్లర్స్‌ పెట్టారని విమర్శించారు. నారాయణపేట – మక్తల్‌ – కొడంగల్‌ ప్రాజెక్టు పూర్తిచేస్తుంటే అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. భూ సేకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ఎకరానికి రూ.14 లక్షలు ఉంటే 20 లక్షలు పెంచి ఇచ్చామన్నారు. 94శాతం మంది రైతులు స్వచ్ఛందంగా ప్రాజెక్టుకు భూములు ఇచ్చారని తెలిపారు. ముదిరాజ్‌ సామాజిక తరగతికి చెందిన వ్యక్తికి మత్స్యశాఖ కేటాయించడం దేశంలోనే ఇదే మొదటిసారి అన్నారు. గతంలో చేపపిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మత్స్య శాఖను ప్రక్షాళన చేశామని, అన్ని చెరువుల దగ్గర చేప గుర్తు వున్న బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో చేప రకం, ఎన్ని చేపలు వదిలాం, సంఘం అధ్యక్షుని పేరు ఉంటుందని అన్నారు. ఈరోజు ప్రారంభం చేసిన చేపల విడుదల ద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని వివరించారు.
బీసీ సమాజంలో నూటికి నూరు శాతం కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు మంత్రి వాకిటి శ్రీహరి అని, ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్న నాయకుడని వైద్యఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తమ ప్రభుత్వంలో 100 శాతం రాయితీతో 26 వేల చెరువుల్లో 88 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. బీసీ సమాజంలో నాయకత్వం ఎదగాలి తద్వారా వెనుకబడిన కులాలకు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత సెల్‌ చైర్మెన్‌ నాగరాజుగౌడ్‌, బీకేఆర్‌ ఫౌండేషన్‌ బాలకృష్ణారెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు కాంతు, మక్తల్‌ అధ్యక్షులు కొల్ల వెంకటేష్‌, నాయకులు అంజయ్య చారి, పోలీస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, గాయత్రి, అనిల్‌, గణేష్‌, వి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -