Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయంఅదానీ సేవలో తరిస్తున్న మోడీ సర్కార్‌

అదానీ సేవలో తరిస్తున్న మోడీ సర్కార్‌

- Advertisement -

– భారత గ్రిడ్‌కు గొడ్డా ప్లాంట్‌ అనుసంధానం
– కొత్త ట్రాన్స్‌మిషన్‌ పవర్‌ లైన్‌కు మార్గం సుగమం
– అదానీ పవర్‌ ప్రణాళికకు మోడీ సర్కార్‌ గ్రీన్‌సిగల్‌
– బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ సరఫరా కోసం నిర్మించిందే గొడ్డా ప్లాంట్‌
– అక్కడ ప్రభుత్వం మారటంతో నిలిచిన విద్యుత్‌ కొనుగోలు
– తాజా చర్యతో భారత్‌లో విద్యుత్‌ విక్రయానికి ఏపీఎల్‌కు లభించిన అనుమతి

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన బడా వ్యాపారవేత్త అదానీ కోసం మోడీ సర్కారు కదిలింది. ఆయనకు కష్టం వస్తే ఆదుకునేందుకు ముందుండే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మరోసారి దానిని నిరూపించింది. జార్ఖండ్‌లోని గొడ్డా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఇండియన్‌ నేషనల్‌ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కు అనుసంధానించేందుకు లైన్‌ క్లియర్‌ చేసింది. ఇందుకు అదానీ పవర్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌)కు అనుమతినిచ్చింది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మొత్తం బంగ్లాదేశ్‌కు సరఫరా అయ్యేది. ఇప్పుడు దీనిని భారత గ్రిడ్‌కు అనుసంధానిస్తూ మోడీ సర్కార్‌ గ్రీన్‌ సిగల్‌ ఇవ్వటం గమనార్హం. తాజా నిర్ణయంతో ఏపీఎల్‌ ఇప్పుడు గొడ్డా ప్లాంట్‌ను భారతదేశ ఇంటర్‌-స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ (ఐఎస్‌టీఎస్‌)కు అనుసంధానించే కొత్త ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ (పవర్‌లైన్‌)ను వేస్తుంది. ఇది రాష్ట్రాల మధ్య విద్యుత్‌ను తరలించే హై-వోల్టేజ్‌ జాతీయ గ్రిడ్‌. ఇది ఇప్పటికే ఉన్న కహల్గావ్‌ ఏ- మైథాన్‌ బీ 400 కేవీ లైన్‌కు లైన్‌-ఇన్‌-లైన్‌-అవుట్‌ (ఎల్‌ఐఎల్‌ఓ) కనెక్షన్‌ను ఉపయోగించి చేయబడుతుంది. ఈ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ గొడ్డా జిల్లాలోని 56 గ్రామాల గుండా వెళ్లనున్నది.

మోడీ సర్కార్‌.. అదానీ పవర్‌కు కొన్ని న్యాయ అధికారాలనూ కట్టబెట్టింది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌, 1885 కింద టెలిగ్రాఫ్‌ అథారిటీకి ఉండే అధికారాలనే కేంద్రం అదానీ పవర్‌కు కల్పించింది. దీని అర్థం.. ప్రయివేటు ప్రాపర్టీ మీదుగా స్తంభాలు, లైన్లను వేసే అధికారం ఉంటుంది. అయితే దీనికి కొన్ని షరతులు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ యాక్ట్‌, 2003లోని సెక్షన్‌ 164ను అనుసరించి ఈ అధికారాలను కట్టబెట్టారు.

కేంద్రం నిర్ణయంపై ఆందోళనలు
అయితే అదానీ పవర్‌కు మోడీ సర్కార్‌ మార్గం సుగమం చేసేలా అనుమతివ్వటంపై పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. గొడ్డా ప్లాంట్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (సెజ్‌)లో ఉన్నది. మార్చి, 2019లో అప్పటి కేంద్రం ప్రభుత్వమే ఈ ప్రకటన చేసింది. ప్రత్యేకించి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేసేందుకు ఈ ప్లాంట్‌ను నిర్మించారు. అయితే గతేడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో అక్కడి ప్రభుత్వం మారింది. కొత్త వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం గొడ్డా ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలును తగ్గించటం, లేదా ఆపేయటం చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు అవసరం లేకుంటే.. వినియోగంలో లేని ఈ విద్యుత్‌ను భారత్‌లో విక్రయించటానికి అనుమతి కోసం అదానీ పవర్‌ అభ్యర్థించింది. అదానీ పవర్‌ కోసం పలు ప్రభుత్వ ఏజెన్సీలు కదిలాయి. నిబంధనలు, మార్గదర్శకాలను సవరించాయి.

కదిలిన ప్రభుత్వ యంత్రాంగాలు.. మారిన నిబంధనలు, మార్గదర్శకాలు
భారత్‌లో విద్యుత్‌ విక్రయానికి అనుమతి కోసం గతేడాది ఆగస్ట్‌లో అదానీ కంపెనీ అనుమతి కోరింది. దీంతో విద్యుత్‌ మంత్రిత్వ శాఖ క్రాస్‌-బోర్డర్‌ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ గైడ్‌లైన్స్‌ను గతేడాది ఆగస్ట్‌లో సవరించింది. ఇక గతేడాది ఆగస్ట్‌లోనే కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) కూడా తన సాంకేతిక నిబంధనలను మార్చింది. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (సీఈఆర్‌సీ) సైతం తన నియమాలను అదే ఏడాది డిసెంబర్‌లో సవరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ట్రాన్స్‌మిషన్‌ కనెక్షన్‌కు అధికారికంగా ఆమోదం తెలిపింది. తాజాగా కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వటంతో అదానీ గొడ్డా ప్లాంట్‌ నుంచి భారత గ్రిడ్‌కు విద్యుత్‌ సరఫరాకు మార్గం సుగమమైంది.

ఈ అనుమతి 25 ఏండ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఏపీఎల్‌.. రైల్వే, రహదార్లు, ఏవియేషన్‌, రక్షణ వంటి స్థానిక, జాతీయ సంస్థల నుంచి తప్పక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రాన్స్‌మిషన్‌ రూట్‌ అనేది జీఐబీ-ప్రొటెక్టెడ్‌ జోన్స్‌ గుండా వెళ్తే.. కంపెనీ సుప్రీంకోర్టు జారీ చేసిన పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుంది.

ప్లాంట్‌ నేపథ్యం
అదానీకి చెందిన గొడ్డా ప్లాంట్‌ 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ పవర్‌ స్టేషన్‌. ఇది జార్ఖండ్‌లోని గొడ్డాలో ఉన్నది. ఇది భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ విద్యుత్‌ ప్రాజెక్ట్‌. దీని ప్రధాన లక్ష్యం బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయడం. ఈ ప్లాంట్‌ అదానీ గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన అదానీ పవర్‌ ద్వారా నిర్వహించబడుతోంది. 2019లో ఈ ప్లాంట్‌ను స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌గా ప్రకటించారు. దీంతో పన్నులు, సుంకాలపై గణనీయమైన రాయితీలను ఈ ప్లాంట్‌ పొందింది. బంగ్లాదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (బీపీడీబీ)తో చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం ఈ ప్లాంట్‌ బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. 2023లో ఇది పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. 2024 ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో పాలనా మార్పుల తర్వాత.. మోడీ ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను భారతీయ పవర్‌ గ్రిడ్‌కు తాత్కాలికంగా అనుసంధానించడానికి అనుమతినిచ్చింది. బంగ్లాదేశ్‌ నుంచి డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు లేదా చెల్లింపుల్లో సమస్యలు తలెత్తినప్పుడు ఈ ప్లాంట్‌ నుంచి భారత్‌లోని గ్రిడ్‌కు విద్యుత్‌ సరఫరా చేయడానికి ఇది వీలు కల్పించింది. కేంద్రం తాజా ఆమోదంతో ఈ అనుసంధానానికి 25 ఏండ్ల పాటు శాశ్వత ఆమోదం లభించినట్టయ్యింది.

గొడ్డా ప్లాంట్‌పై పలు వివాదాలు
అదానీ గొడ్డా ప్లాంట్‌పై ఇప్పటికే అనేక వివాదాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఈ ప్లాంట్‌ నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక భూసేకరణ చట్టం-2013ను ఉల్లంఘించి మరీ బలవంతంగా భూములను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. ఆ సమయంలో స్థానిక రైతులు, గిరిజనులు దీనిపై నిరసనలు కూడా చేశారు. ఈ ప్లాంట్‌ నిర్మాణంతో పర్యావరణ కాలుష్యం పెరుగుతుందనీ, కార్మికులకు సరైన ఉపాధి ప్పందాలు లేవని పర్యావరణవేత్తలు, కార్మిక సంఘాల నుంచి ఆందోళనలూ వ్యక్తమయ్యాయి. ఇక విద్యుత్‌ ఎక్స్‌పోర్ట్‌ కోసం సెజ్‌ హోదా పొందినప్పటికీ.. ఈ ప్లాంట్‌ దేశీయంగా విద్యుత్‌ను విక్రయించేందుకు నిబంధనలను మార్చడం అదానీ గ్రూపునకు మాత్రమే లబ్దిని చేకూరుస్తుందని విశ్లేషకులు, మేధావులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -