Saturday, October 18, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

- Advertisement -

– ముఖ్య అతిథిగా బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జీత్‌సింగ్‌ చౌదరీ
– ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభభాయ్ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 77వ బ్యాచ్‌ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) దల్జీత్‌సింగ్‌ చౌదరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ఐపీఎస్‌ కుటుంబసభ్యులు వచ్చారు. బెస్ట్‌ అచీవర్స్‌, ప్రతిభ కనబర్చిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులను అందించారు. బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జీత్‌సింగ్‌ చౌదరీ మాట్లాడుతూ.. మానవ హక్కులను కాపాడాలనీ, ముందున్న సవాళ్లు అధిగమించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్‌, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్‌లే కీలకమని చెప్పారు. సైబర్‌ నేరాలు, ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలన్నారు. ధనవంతులు, పేదవారిని ఒకేలా చూడాలని సూచించారు. సాంకేతికత మీదే ఆధారపడొద్దనీ, క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

పరేడ్‌ కమాండర్‌గా ట్రైపీ ఐపీఎస్‌ ఎ.నాయర్‌ వ్యవహరించారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ, టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ట్రైనింగ్‌ పూర్తయింది. 190 మంది ఆఫీసర్లకు హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభభారు నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ ఇటీవలే పూర్తయింది. ఇందులో 174 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లు, 16 మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారిలో 62 మంది మహిళలు, 112 మంది పురుషులు ఉన్నారు. ఐపీఎస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారిలో ఇంజినీరింగ్‌ చదివినవారు 50 శాతం మంది (87 మంది) ఉన్నారు. ఆర్ట్స్‌ విభాగానికి చెందినవారు 29 మంది, ఎంబీబీఎస్‌ నేపథ్యం ఉన్న వారు 8 మంది, లా చదివినవారు ఆరుగురు, సైన్స్‌ విభాగానికి చెందినవారు 36 మంది ఉన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లలో తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురిని కేటాయించారు. తెలంగాణకు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళా ఐపీఎస్‌ను కేటాయించారు. 77వ బ్యాచ్‌లో అత్యధికంగా 36.63 శాతం మంది (62 మంది) మహిళలు ఉన్నారు. 25 ఏండ్లలోపు వయసున్నవారు 21 మంది ఉన్నారు. వీరిలో 14 మంది పురుషులు కాగా.. ఏడుగురు మహిళలు. ఇప్పటి వరకు సర్దార్‌ వల్లభభాయ్ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 6476 మంది ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -