Saturday, October 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ నిర్మూలనకు సమన్వయం చేసుకోవాలి

డ్రగ్స్‌ నిర్మూలనకు సమన్వయం చేసుకోవాలి

- Advertisement -

పోలీస్‌, ఆరోగ్యశాఖల అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్‌, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ రెండు విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి మత్తు పదార్థాల నిర్మూలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. వాటి నిర్మూలనకు ప్రజలంందరు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. కేవలం ప్రభుత్వంతోనే నిర్మూలన సాధ్యం కాదనీ, అన్ని వర్గాలను పోరాటంలో భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు. పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు, టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. వాటిని తీసుకుంటున్న వారిలో వచ్చే ప్రవర్తనలో వచ్చే మార్పులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వ హించాలని మంత్రి సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లలో రెగ్యులర్‌గా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.

క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని హెల్త్‌ సెక్రెటరీకి మంత్రి సూచించారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటి నార్కొటిక్స్‌ వింగ్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. డ్రగ్స్‌ వినియోగం నుంచి బయట పడేసేందుకు అవసరమైన డీఅడిక్షన్‌ సెంటర్లను బలోపేతం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్‌ హాస్పిటళ్లలో డీఅడిక్షన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎర్రగడ్డలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని, అలాగే అవసరాన్నిబట్టి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటైన పిల్లలను తల్లిదండ్రులే డీఅడిక్షన్‌ సెంటర్లకు తీసుకురావాలని మంత్రి కోరారు. పూర్తి ఉచితంగా వారికి కౌన్సెలింగ్‌, చికిత్స అందిస్తామని తెలిపారు. పిల్లలకు మత్తు పదార్థాలకు అలవాటైనట్టు గుర్తించాక ఆలస్యం చేయొద్దనీ, ఆలస్యమయ్యేకొద్దీ వారి ఆరోగ్యం మరింత పాడయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి తెలంగాణ యాంటీ – నార్కొటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య మంత్రికి వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటైన వారిని గుర్తించి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుస్తున్నామనీ, ఆ తర్వాత వారిని డీఅడిక్షన్‌ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలు అయినవారిని గుర్తించేందుకు ఆరోగ్యశాఖ సహకారం తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ డైరెక్టర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాసీం, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, టీఏఎన్‌బీ ఎస్పీ రూపేశ్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌, డాక్టర్‌ అనిత, న్యాయ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ సునీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -