నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్వహిస్తున్న బందులో భాగంగా కల్వకుర్తి పట్టణంలో బస్ డిపో ముందు నిర్వహించిన ధర్నాకు శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిస్తే తీర్మానాన్ని ఆమోదించకుండా తప్పించుకున్నారని ఆయన మండిపడ్డారు.
ఈరోజు బీసీలు రోడ్డుపైకి రావడానికి కారణం బిజెపి అని ఆయన అన్నారు. పార్లమెంట్లో బిల్లుని ఆమోదించి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం చేయాలని దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు . దామాషా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని 42 శాతం రిజర్వేషన్ల కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈ లక్ష్య సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని, యావత్తు బిసి సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.