Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42 శాతం రిజర్వేషన్లు సాధించేదాక పోరాటం ఆగబోదు

42 శాతం రిజర్వేషన్లు సాధించేదాక పోరాటం ఆగబోదు

- Advertisement -

అఖిల పక్షం
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

బీసీ రిజర్వేషన్ ల బంద్ కు సహకరించిన జోగులాంబ గద్వాల జిల్లా వ్యాపారస్తులు,విద్యాసంస్థలు,పోలీసు సిబ్బందికి,రాజకీయ పార్టీల నాయకులకు,శక్తులకు,వ్యక్తులకు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దాకా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగబోదని జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష నాయకులు అన్నారు.ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కొంతమంది కుహన మేధావులు బంద్ ఎవరికి వ్యతిరేకంగా అనే సందిగ్ధాన్ని ప్రజల మధ్య చర్చకు పెడుతున్నారని, అందులో ఎటువంటి అనుమానాలు లేవని,కేంద్రంలో రిజర్వేషన్ లను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకున్న అధికారంలో ఉన్న కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగానే బంద్ చేపట్టామని స్పష్టం చేశారు.బీజేపీ ఒకవైపు కేంద్రంలో రిజర్వేషన్ బిల్లును, ఆర్డినేన్స్ ను అడ్డుకుంటూ మరోవైపు రాష్ట్రంలో బీసీలు చేపట్టిన బంద్ కు మద్దతు ప్రకటించడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్న చందంగా తయారైందని విమర్శించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్డుకుంటున్న నియంతృత్వ బిజెపి వైఖరి పై అఖిలపక్ష పార్టీలుగా పోరాడుతూనే ఉంటామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు.EWS లకు లేని ఆటంకాలు బీసీలకే ఎలా వస్తాయని  కేంద్రాన్ని ప్రశ్నించారు.బీజేపీ మనువాద పొగరుతో సామాజిక న్యాయానికి పాతారేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.రాజ్యాంగ సవరణ చేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలిపారు.దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించకుండా ప్రజల మధ్య విద్వేష విభజన రాజకీయాలకు కారణమవుతున్న బిజెపి రెండు నాలుకల ధోరణిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు.చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్న వారిని సైతం పార్టీ కార్యకర్తల లాగా పని ఉపయోగిస్తున్న బిజెపి రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులోనూ పోరాడుతామన్నారు.గవర్నర్ ఆమోదించనందువల్లే కోర్టు స్టే విధించిందని,గవర్నర్ రాష్ట్రం లో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పని చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ సమాజంపై కక్ష గట్టిన బీజేపీకి తగు రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అఖిలపక్ష పార్టీలను కలుపుకొని రిజర్వేషన్ల సాధనకై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై నిరవధిక ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కేవలం న్యాయపోరాటాలకే పరిమితమైతే సరిపోదని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రిజర్వేషన్లను హక్కుగా తీసుకోవాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని ఒంటరిగా చేయడం సరైన పద్ధతి కాదన్నారు.నిన్న నిర్వహించిన బంద్ సందర్భంగా సహకరించిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు,ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు,వ్యాపారస్తులకు, పోలిసు శాఖ వారికి, అఖిలపక్ష రాజకీయ పార్టీలు,సామాజిక ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలకు పేరుపేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పోరాటం నడిగడ్డ చరిత్రలోనే ఉందని ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జరిగే భవిష్యత్తు పోరాటాలలో సైతం అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు,బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ బాబు,సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వెంకటస్వామి, బి.ఆంజనేయులు,TJS జిల్లా అధ్యక్షులు ఆలూరు ప్రకాష్ గౌడ్,తెలంగాణ ప్రజాఫంట్ రాష్ట్ర కోశాధికారి శంకర ప్రభాకర్,బహుజన రాజ్యసమితి వాల్మీకి వినోద్ కుమార్ టిఆర్ఎస్వి జిల్లా కన్వీనర్ పల్లయ్య,BRS నాయకులు గంజిపేట రాజు, టవర్ మబ్బుల్, శ్రీనివాస్ సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ,కాంగ్రెస్ యువ నాయకులు దరూర్ రవి,తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాగన్న,కృష్ణ,కిరణ్,వీర భద్రప్ప,రాజేష్, కృష్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -