– జాతీయ రహదారి 63పై మహా ధర్నా
– గ్రామంలో 90 శాతం సోయ సాగు చేసిన రైతులు
– కొనుగోలు కేంద్రం లేక రైతుల అవస్థలు
– రైతుల కష్టం దళారుల పాలు
– మొక్కజొన్నపై ఆంక్షలు ఎత్తివేయాలని రైతుల డిమాండ్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వం తక్షణమే సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చలో కమ్మర్ పల్లి రైతు మహాధర్నా పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 200 మంది రైతులు మండల కేంద్రంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ (హాస కొత్తూర్) చౌరస్తా వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సోయలు, మక్కలు వెంటనే కొనుగోలు చేయాలని, వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలని ప్లకార్డులను, బ్యానర్లను రైతులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉప్లూర్ గ్రామంలో 90 శాతం కు పైగా రైతులు సోయాబీన్ పంటను సాగు చేశారన్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మిగిలిన పంటను అష్ట కష్టాలకోడ్చి కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడం మూలంగా దళారులు అడిగిన కాడికి రైతు తన పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వ అలసత్వం వల్ల రైతుల శ్రమ దళారుల పాలవుతుంటే, రైతు ఆరుగాలం శ్రమకోడ్చి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితి లేక అప్పుల పాలవుతున్నాడన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు పై ఆంక్షలు ఎత్తివేయాలని, యాసంగి వరి పంట బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు అరగంటకు పైగా జాతీయ రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ధర్నా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు రేగుంట దేవేందర్, బద్దం రమేష్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, కొమ్ముల రవీందర్, యాల్ల గణపతి, కొమ్ముల రంజిత్, అవారి మురళి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సోయా కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన ఉప్లూర్ రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES