నవతెలంగాణ – అశ్వారావుపేట
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆదివారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురికి అభినందనలు, ఆశీర్వాదాలు, పరామర్శలు, ఓదార్పు లు అందించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన అశ్వారావుపేట కు చెందిన ఫోటోగ్రాఫర్, రిపోర్టర్ కేసిబోయిన వీరాంజనేయులు – రమాదేవి దంపతుల కుమార్తె భవ్య శ్రీ లక్ష్మిని శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయస్థాయిలో కూడా విజయం సాధించి తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.
తదుపరి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఐవీఎస్ రెడ్డి మాతృమూర్తి ని పరామర్శించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందిన టీవీ 9 ప్రతినిధి కొల్లి రవికిరణ్ తండ్రి లాజర్,అల్లాడి పెద్ద నారాయణ, పేరాయిగూడెం నివాసులు కలపాల బాబురావు, కలపాల భద్రం లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ములకలపల్లి మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి నివాసంలో స్థానిక నాయకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విశ్రాంత ఏఎస్సై నార్లపాటి జగ్గారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పూర్వ ఉపాధ్యక్షులు మందపాటి రాజ మోహన్‌రెడ్డి, చిట్లూరి ఫణీంద్ర, వగ్గెల పూజ, సత్యవరపు సంపూర్ణ, జుజ్జూరపు శ్రీరామ్, మూర్తి, గుడవర్తి వెంకటేశ్వరరావు, మోటూరి మోహన్, బజారయ్య, చిన్నబ్బాయి, తాళం సూరి, నక్క రాంబాబు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.