Sunday, October 19, 2025
E-PAPER
Homeకరీంనగర్జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ

- Advertisement -

అధికార పార్టీలో ఆశావాహుల జోరు…
16 మంది నామినేషన్ల దాఖలు…
నవంబర్ మొదటి వారంలో ప్రకటించనున్న అధిష్టానం?..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అధికార పార్టీలో ఆశావాహుల జోరు నామినేషన్లతో స్పష్టమైంది. గత మూడు రోజుల క్రితం నామినేషన్లు స్వీకరించగా, ఏకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవికి సుమారు 16 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నవంబర్ మొదటి వారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షున్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

దాంతో ఆశవాహులు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం వారి ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొంతమంది రహస్యంగా మంత్రులను కూడా కలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామినేషన్లు వేసిన నేతల్లో కొంతమంది ఎవరికి వారే నాకే జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది నాయకులు జిల్లా అధ్యక్ష పదవి ఈసారి వరిస్తుందని ఆశలు పెట్టుకోగా పార్టీలోని ఓ కీలక నేత నామినేషన్ జిల్లా అధ్యక్ష పదవికి రావడంతో నామినేషన్ వేసిన వారిలో అనేకమంది ఆయనకు ఇవ్వకపోతే మాకు ఇవ్వండని ఏఐసిసి పరిశీలకులతో చెప్పినట్లు సమాచారం.

జిల్లా అధ్యక్ష పదవికి 16 నామినేషన్లు…

రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి కి ఈనెల 17న ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ .వి. మానే దరఖాస్తులు స్వీకరించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్లు వేయాలనే నిబంధన పెట్టారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవికి 16 మంది  నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. జిల్లా అధ్యక్ష పదవికి సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, చీటీ ఉమేష్ రావు, జలగం ప్రవీణ్ కుమార్ (టోనీ), ఆకునూరి బాలరాజు, కనిమేని చక్రధర్ రెడ్డి, నేవూరి వెంకట్ రెడ్డి, కూస రవీందర్, దొమ్మాటి నరసయ్య, ఎల్ల బాల్ రెడ్డి, నాగుల విష్ణు, బుర్ర రవితేజ గౌడ్, గొట్టే ప్రభాకర్, వెంకట్ రామ్ రెడ్డి, స్వామి లు నామినేషన్ వేసినట్లు సమాచారం.

బలమైన నేతకే జిల్లా పార్టీ పగ్గాలు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా కు ధార్మిక, కార్మిక క్షేత్రంగా పేరు ఉంది నిత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వెంట ఉండే వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు  తెలుస్తోంది. అంతేకాకుండా కేటీఆర్ అడ్డగా పిలువబడే సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీని తట్టుకొని నిలబడాలంటే ఆశామాసి కాదు. సిరిసిల్లలో కాంగ్రెస్ పాగా వేయాలంటే, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకు దీటైన జవాబుదారీతనం ప్రదర్శించే బలమైన నాయకునికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించాలనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన వారినీ మీరు కాకపోతే మరొక వ్యక్తి జిల్లా అధ్యక్ష పదవికి ఎవరు అర్హులని ఏఐసీసీ పరిశీలకులు అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందని వారి నుంచి కూడా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీలోని  అనేకమంది ఒకే నాయకుడి  పేరు చెప్పినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

నవంబర్ మొదటి వారంలో ప్రకటించనున్న అధిష్టానం?..

గత మూడు రోజుల క్రితం నామినేషన్లు స్వీకరించిన పరిశీలకులు అభ్యర్థుల జాబితాను అధిష్టానం ముందు పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి అభ్యర్థి పూర్తి సమాచారాన్ని అధిష్టానం సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నవంబర్ మొదటి వారం అంటే ఇంకా పక్షం రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షున్ని ప్రకటించనున్నట్లు ఊహాగానాలు వెలబడుతున్నాయి. ఇప్పటికే ఆశావాహులు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం వారి ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, ఇంకా కొంతమంది ఆశావాహులు మంత్రుల ఆశీర్వాదాల కోసం రహస్యంగా కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుని పదవి ఎవరిని వరిస్తుందనేది తెలియాలంటే పక్షం రోజులు వేచి చూడాల్సిందే…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -