మా తాత గోడకు బొమ్మైన తర్వాత
నాయనమ్మ ఒంటిమామిడి చెట్టయింది
రోజూ కన్నీటి బొట్లలో తడిసిపోతూ
నిశ్శబ్దపు నీడలోకి జారిపోయేది
కడుపులో కాసిన కాయల కోసం
అలుపు లేకుండా ఆరాటపడి
ఎత్తు నిచ్చెనలు ఎక్కిస్తే
చివరకు కాయలకు తీగ బరువైంది
గుప్పెడు గంజి నీళ్ల కోసం తిప్పలు పడుతూ
నెలకోసారి నెలవంకలా గడపలో అడ్గుపెట్టేది
వస్తూ వస్తూ మూటెడు వ్యధలు,
కథలు మోసుకొస్తూ మా ఎదలపై ఆరబోసేది
ఆమె అక్షరాలను మింగకున్నా అందమ్కెన
అభినయంతో గతకాలపు ముచ్చట్లను ముందరేసి
మా గుండెలను నిలువునా పిండేసేది
వెలుగులు చీకట్లను మింగక ముందే ఆకిల్ని
నింగిలోని సుక్కల తోని నిండుగా నింపేది
నడిమిట్ల అచ్చిన నడమంత్రపు పేస్ట్ లకు పాతరేసి
బొగ్గుతోనే పళ్ళను మెరిపించేది
శాయకోసం తన కండ్లను ఆగేయ అర్రకు
ఆత్రంగా ఏలాడ దీసేది
కాసిన్ని ఉడుకు నీళ్లు గొంతులో పడ్డాక
నాలుగు బుక్కల చుట్టను తప్తిగా తాగేసి
కాసేపు కంటి రెప్పలను అలా వాల్చేది
కారం వేసినా, కమ్మని కూర పెట్టినా, ఏనాడు కిమ్మనకుండా
కడుపులో పడేసి తన పరివారపు పరువును గుండెలో దాచేది
తొంబై ఏండ్లు అచ్చిన తలపై తెల్ల ఏంట్రుకలు
ఊసు లేదు, దవడ పండ్లు ఊగిన జాడలేదు
సుస్తి జేత్తే పడిగడుపున పసుపు ముద్ద
గోరువెచ్చని నీళ్లు నాలుగు పూటలు దట్టించి
నయం జేసుకోనే మా నాయనమ్మ మంచల
సత్యనారాయణకు మంచి గురువు
కొండ మీదున్న తాతకు తక్లఫ్ అయితాందని
నాకు శెప్పకుండానే ఎల్లి పోయింది
ఇప్పుడు నాయనమ్మ లేదు కానీ ఆమె
గుర్తులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి
ఆమె లేదు కానీ ఆమె మాటల లోతులు
నాకు జీవితపు మార్గాలవుతున్నాయి
ఆమె ఒక నడుస్తున్న నిఘంటువు
ఆమే మా వంశపు వారసత్వపు వారధి
- తాటిపాముల రమేశ్, 7981566031