Monday, October 20, 2025
E-PAPER
Homeదర్వాజప్రకతిలోంచి ప్రకతిలోకి చేసే ప్రయాణమే కవిత్వం

ప్రకతిలోంచి ప్రకతిలోకి చేసే ప్రయాణమే కవిత్వం

- Advertisement -

‘త్రివేణి’ అంటే మూడు నదుల సంగమం. వారాల ఆనంద్‌ త్రివేణి మూడు పంక్తుల కవిత్వం. అవటానికి మూడు పంక్తుల కవితలే అయినా, అవి ఎన్నో విషయాలను, జీవిత సత్యాలను అలతి అలతి మాటలతో తెలియచేసే ఒక సమాహారం. ప్రకతిలోంచి ప్రకతిలోకి చేసే ప్రయాణమే కవిత్వం అంటూ ప్రకతినీ, మనుషుల తత్వాన్నీ, మిత్రులనూ, జీవితపు ఆటుపోట్లనూ, తన ఊరినీ, తన ఉనికినీ, ఇది అది అని లేక అన్నిటినీ స్పృశిస్తూ నడక సాగిస్తుంది ఈ ‘త్రివేణి’.

‘ఎవరో తలుపు తట్టిన చప్పుడు/ ఇంటి తలుపా/ గుండె తలుపా’ అంటూ మొదలయిన ఈ పుస్తకం అలవోకగా కొనసాగుతూ, గుండె తలుపును తడుతూ తప్పకుండా ఇంటి తలుపును మరిచిపోయేలా చేస్తుంది.
‘చీకటింకా తెమలలేదు,/ మబ్బులు ఒళ్ళు విరుచుకోలేదు పక్షులు నిశ్శబ్దంగా తమ రెక్కల మీద/ తూర్పు వెలుగుల్ని మోసుకొస్తున్నయి’ అని ప్రకతిని హృద్యంగా వర్ణిస్తూ
‘సాయంకాలం వ్యాహ్యాళికి బయల్దేరా/ చల్ల గాలీ/ జతగూడింది/ అంటూ ప్రకృతితో తనకున్న అనుబంధాన్ని చెబుతారు ఆనంద్‌.
‘తెలుసుకోవడానికే వచ్చాం/ తెలిసో తెలియకో వెళ్లిపోతాం/ తెలియచెప్పడానికే వచ్చామంటేనే కష్టం’ అని మనకే అన్నీ తెలుసనే అహాన్ని వీడమని చెప్పకనే చెప్పారు.
‘మెరుపు కళ్ళతో విన్నప్పుడు/ చుట్టూ ఉన్న కవులు/ నే రాయడం మొదలు పెట్టగానే పక్కకు తప్పుకున్నారు’ అంటూ శ్రోతలూ పాఠకులే కావాలి తప్ప పోటీదారులు వద్దు అనుకునే ఈనాటి సాహితీ ప్రపంచపు తీరుతెన్నులను సున్నితంగా విమర్శించారు.

‘చురకలకు చిందులేసావు/ ముక్తకాలకు మురిసిపోయావు/ ముసాఫిర్‌ లా వెళ్లిపోయావు’ అంటూ అర్దాంతరంగా వెళ్ళిపోయిన మితని గురించి రాసుకున్నారు.
అది మూల వాగు తీరం/ ఆ వూరో మమతల దారం/ పేద జనం జాతర/ అంటూ తన ఊరుని గుర్తు చేస్కున్నారు.
ఇక్కడి మొక్కుల్లో భక్తులు / కోడెను మాత్రమే కాదు/ తమ విశ్వాసాన్నీ కట్టేసి పోతారు’ అని వేములవాడ లోని కోడె మొక్కులను గురించీ, ఇక్కడి శివ పార్వతుల శ్వాస / తెలంగాణా మొత్తానికి / గొప్ప ఊపిరి’ అంటూ, ఇదేమి చిత్రమో రాముని లగ్గం నాడు / శివున్నిపెళ్లి చేసుకుంటరు/ అడ్దబొట్టూ నిలువుబొట్టూ అంతా సమానమే’ అంటూ వేములవాడ ప్రాశస్త్యాన్ని గొప్పగా చెబుతారు.
మా అమ్మను గన్న వూరు ననుకన్న పేగు/ మిఠాయోళ్ళ జోరు చిలుకల పేరు/ బత్తీసల దండ నా ్ఞపకాల ఊరేగింపు’ అంటూ, రాజన్న కొలువు వొట్టి కొలువు కాదు/ కవిత్వం కలబోసిన మేలుకొలుపు/ మనసంతరాల్లోంచి ఉబికిన వేదనాభరిత పిలుపు’ అంటూ తన సొంత ఊరితో పెనవేసుకుని ఉన్న తన జ్ఞాపకాలనూ తన ఉనికినీ, అనుబంధాన్నీ తెలియచేస్తారు.

చిరునవ్వుల సమయాన్ని / ఇట్టే మరిచిపోగలం / దుఃఖపు తడిని విడిచి పోలేము/ అంటూనే ‘చల్లటి హాయి గొల్పే గాలే కాదు/ వేడి గాలిలోనూ /చిరునామా చిరునవ్వే అవ్వాలి/ అని చెపుతూ సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించమన్నారు.
దాదాపు అదే అర్ధాన్ని మరో కవితలో మరొక విధంగా కూడా చెప్తారు, దుఃఖాన్ని మరిచిపొమ్మనీ, సంతోషాన్ని దాచుకోమనీ. /పూలూ ముళ్ళూ కుప్పబోసినట్టు/ ఎన్ని అనుభవాలో/ నేనేమో ఒక్కో పువ్వునూ ఏరుకుని దాచుకుంటాను/ అని’ అలాగే పువ్వునీ పరిమళాన్నీ మనసారా ప్రేమించా/ కాలం పువ్వుని లాక్కెళ్ళింది/ పరిమళం నాతో ఉండిపోయింది/ అంటూ మనవి అనుకున్నవి మనకి దూరమయినా ఆ ్ఞపకాలు మనతోనే ఉంటాయనీ చెప్పారు. ఊయలలూగే ఊహలు/ సాగిలపడే సాధన/ రెంటి నడుమ అగాధమే/ అంటూ చిత్తశుద్దీ, కృషి లేనప్పుడు ఏమీ సాధించలేమని చక్కగా చెప్పారు.

‘జీవితం ఆశావాహమైందే కాదు/ అపోహ పూరితమైంది కూడా/ వ్ఞిత ఎంచుకోవడం లోనే ఉంది’ అంటూ జీవన దృక్పథం లో మనిషికి వ్ఞిత ఎంత అవసరమో చెబుతారు.
‘నాట్లేసేటప్పుడు హౌరెత్తిన రైతు పాటలు / మార్కెట్‌ చేరేసరికి / మూగనోము పాటించాల్సి వచ్చింది’ అంటూ రైతన్న గోడును గురించీ చెప్పారు.
పట్నం వచ్చిన పల్లెటూరోడు/ పతా అడిగితే ప్రతివాడూ/ గూగుల్‌ మ్యప్‌ చూసుకోమంటున్నాడు/ అంటూ నగరవాసపు ఇక్కట్లనూ చెప్పారు.
రోజంతా ఆన్లైన్‌ వర్క్‌ ఫ్రొం హౌం/ అర్దరాత్రి దాకా ఆఫీసు కాల్స్‌/ సూర్యోద్యం చూసి ఎన్నాళ్ళయిందో/ అనీ అన్నారు.

అలాగే ‘బర్గర్లు పిజ్జాలు/ జొమాటోలు రాపిడోలు/ పొయ్యికి దూరం పెయ్యికి భారం’ అంటూ ఆదునిక జీవన శైలినీ, గురించీ వాపోయారు.
ఇలా ‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్టు ఇది అది అని లేక అన్నీ ఆనంద్‌ గారికి కవితా వస్తువులే.
ఈ మూడు పంక్తుల కవితలలో మూడవ పంక్తి , తను చెప్పదలుచుకున్న భావానికి ఒక ముగింపులాగా, ఒక కొసపెరుపు లాగా, ఒక మకుటం లాగా నిలిచింది. కొన్ని పంక్తులు చదవగానే ఓహ్‌ అనిపిస్తే, కొన్ని ఓహౌ అనిపిస్తాయి. కొన్ని చిరునవ్వును పెదవుల మీదికి తెస్తే, కొన్ని ఆలోచింప చేస్తాయి.
నా వరకు నాకు కొన్ని కవితలు అర్ధం కాలేదు. కొన్ని కవితలు రెండు పంక్తులే ఉన్నాయేమో అని అనిపించాయి. అయితే దాదాపు అన్ని కవితలూ ముచ్చటైన మూడు పంక్తులతో త్రివేణి పేరును సార్ధకం చేసుకున్నాయి.

  • అనురాధ బొడ్ల, 9989566696
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -