ఎస్బీఐకి సీపీఐ(ఎం) ఎంపీ లేఖ
న్యూఢిల్లీ : మాల్దీవుల్లోని ప్రవాస భారతీయులకు చెల్లింపుల పరిమితిని ఉపసంహరించుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు ఏఏ రహీం కోరారు. మాల్దీవుల్లోని బ్యాంక్ శాఖలు ఇటీవల విధించిన ఆంక్షల కారణంగా, అక్కడ నివసిస్తున్న చాలామంది భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎస్బీఐ చైర్మెన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. నెలవారీ ఎంవిఆర్ (మాల్దీవియన్ రూపాయి) – ఐఎన్‌ఆర్ (భారతీయ రూపాయి) చెల్లింపుల పరిమితి తాత్కాలికంగా ప్రతి ఖాతాదారునికి 150 డాలర్లు (సుమారు ఎంవిఆర్ 2313)కి తగ్గించాయని, ఈ ఏడాది అక్టోబర్ 25 నుండి అమల్లోకి రానుందని తెలిపారు.
ఇవి కాకుండా మాల్దీవుల వెలుపల ఎంవిఆర్ కార్టులతో ఎటిఎం విత్‌డ్రాలు, ఈసీఓఎం / పీఓఎస్ లావాదేవీలు నిలిపివేశారని పేర్కొన్నారు. ఈ చర్య భారత్‌లో తమ కుటుంబాలను పోషించేందుకు క్రమం తప్పకుండా చెల్లింపులు చేసే భారతీయ కార్మికులు, నిపుణులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని తెలిపారు. ఈ ఆకస్మిక ఆంక్షలు వారి ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయడంతో పాటు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ, భారత్‌కు విదేశీ మారకద్రవ్యాన్ని అందించే పరిస్థితుల్లో అనిశ్చితిని సృష్టించాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి, దాని ప్రభావాన్ని తగ్గించేందుకు, మాల్దీవుల్లోని భారతీయులకు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని రహీం ఎస్బీఐని అభ్యర్థించారు.
మాల్దీవుల్లోని భారతీయులపై ఆంక్షలు ఉపసంహరించండి
- Advertisement -
- Advertisement -