Tuesday, May 13, 2025
Homeజాతీయంమీ సేవలు అందించండి

మీ సేవలు అందించండి

- Advertisement -

– మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌కు ప్రభుత్వ ఆహ్వానం
న్యూఢిల్లీ:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడైన ఎలన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ కంపెనీ త్వరలో మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. స్టార్‌లింక్‌కు ఆహ్వానం పలుకుతూ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నుండి ఓ లేఖ పంపారు. భారత ప్రభుత్వ నూతన జాతీయ భద్రతా మార్గదర్శకాలను పాటించేందుకు స్టార్‌లింక్‌ అంగీకరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని అనుమతించాల్సిందిగా సుంకాలు విధించిన కొన్ని దేశాలపై అమెరికా ఒత్తిడి చేసిందని విదేశాంగ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తెలియజేసింది. స్టార్‌లింక్‌ దరఖాస్తు కొంతకాలంగా పరిశీలనలో ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత వారం సవరించిన భద్రతా నిబంధనలు విడుదలైన తర్వాత వాటికి ఆ కంపెనీ అంగీకరించడంతో వెంటనే అనుమతులు లభించాయి. ఉపగ్రహ ఇంటర్నెట్‌ ప్రొవైడర్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భద్రతా నిబంధనల ప్రకారం… వారు తమ వద్ద ఉన్న సమాచారాన్ని భారత సరిహద్దుల లోపలే ఉంచుకోవాలి. బయటకు పంపకూడదు. విదేశీ టర్మినల్స్‌ లేదా ఫెసిలిటీలకు యూజర్‌ కనెక్షన్లను అనుసంధానం చేయడాన్ని నిషేధించారు. సంప్రదింపుల సమయంలో స్టార్‌లింక్‌ రెండు అంశాలపై అయిష్టత వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద టెర్మినల్స్‌ను పర్యవేక్షించడం, శాట్‌కామ్‌ కంపెనీలలో భారతీయులకు మెజారిటీ వాటాలు ఇవ్వడం…ఈ రెండు నిబంధనలను స్టార్‌లింక్‌ ఇష్టపడలేదు. దీంతో ఆ రెండింటినీ ప్రభుత్వం తొలగించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -