Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంఎనిమిది కుటుంబాల సాంఘిక బహిష్కరణ

ఎనిమిది కుటుంబాల సాంఘిక బహిష్కరణ

- Advertisement -

డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి..
– బాధితుల్లో మాజీ సర్పంచ్‌
– పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన
– ప్రజావాణిలో కలెక్టర్‌, సీపీకి ఫిర్యాదు
నవతెలంగాణ-డిచ్‌పల్లి

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామంలో 8 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు (వీడీసీ) సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ విషయమై బాధితులు సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణితో పాటు సీపీ సాయిచైతన్యకు వేర్వేరుగా వినతిపత్రాలను అందజేశారు. అనంతరం సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులు తేలు గణేష్‌ (మాజీ సర్పంచ్‌), మాసిపెద్ది శ్రీనివాస్‌, తేలు గంగాధర్‌, మాసిపెద్ది రవి, ఒడ్డం నర్సయ్య, గోపు రాజేశ్వర్‌, చిత్తపేట నడ్పి గంగారాం, గోపు చరణ్‌ డిచ్‌పల్లి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్‌ 15న గణేష్‌ నిమజ్జనం సందర్భంగా తంగేళ్ల కిషన్‌, మాసిపెద్ది శ్రీనివాస్‌ మధ్య చిన్నపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం మాజీ ఎంపీపీ, కాంగ్రెస్‌ నాయకులు మిట్టపల్లి గ్రామానికి చెందిన కంచెట్టి గంగాధర్‌ అండతో వీడీసీ సభ్యులు మున్నూరుకాపు కులానికి సంబంధించిన 8 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. దాంతో ఆ కుటుంబాల్లో జరిగే శుభ, అశుభ కార్యాలకు గ్రామంలోని ఇతర కులాల వారు హాజరుకావొద్దని, వారికి ఎలాంటి సహకారం అందించవద్దని నిర్ణయించారు. దీనిపై అన్ని కులాల వారికి వీడీసీ తరపున తీర్మానాన్ని అందజేశారు. 8 మందికి మంగళి షాపులో, చాకలి వారికి ప్రత్యేకంగా తీర్మాన కాపీలను పంపించారని తెలిపారు. దాంతో బాధితులు పది నెలలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఈ విషయమై డిచ్‌పల్లి సీఐ కె.మల్లేష్‌, ఎస్‌ఐ మోహమ్మద్‌ షరీఫ్‌ను సంప్రదించినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐకి ఫిర్యాదు చేస్తే వీడీసీ సభ్యులను మందలించకుండా బహిష్కరణ చేసిన వారిని ‘మీరు ఏయే రాజకీయ పార్టీల్లో ఉన్నారంటూ’ ఆరా తీయడం ఏమిటని సీపీ దృష్టికి తెచ్చారు. ప్రశాంతంగా ఉన్న మిట్టపల్లి గ్రామంలో ఓ కాంగ్రెస్‌ నాయకుడు తమలో తమకు గ్రూపులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. దాంతో తాము గత్యంతరం లేక ప్రజావాణిలో కలెక్టర్‌, అలాగే సీపీకి తమకు న్యాయం చేయాలని కోరినట్టు బాధితులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -