Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం21న పోలీసు అమరవీరుల సభ

21న పోలీసు అమరవీరుల సభ

- Advertisement -

గోషామహల్‌ స్టేడియంలో సాయుధ బలగాల పరేడ్‌
ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
ఈ నెల 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి


నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల సంస్మరణార్థం ఈ నెల 21న హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో గల పోలీసు అమరవీరుల స్తూపం వద్ద సాయుధ బలగాల పరేడ్‌, సభ ఉంటాయనీ, ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరవుతారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. 21 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1959 అక్టోబర్‌ 21 లడాఖ్‌ సమీపంలో చైనా సైనికులు జరిపిన దాడులను తిప్పికొడుతూ ఎస్‌ఐ కడఖ్‌ సింగ్‌తో సహా 10 మంది జవానులు వీరమరణం పొందారనీ, వారి ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఏటా అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు.

పది రోజుల పాటు ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో పోలీస్‌ స్టేషన్లలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనీ, అందులో పోలీసుల పనివిధానంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు, భరోసా, షీటీమ్‌, సైబర్‌ టీమ్‌, తదితర విభాగాల పనితీరుపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌, జిల్లా కేంద్రాల్లో ఎస్పీ హెడ్‌ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు, యువతకు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడం, పనిచేసే ప్రాంతాల్లో లింగ వివక్షను రూపుమాపడం వంటి అంశాలపై వ్యాసరచన పోటీలుంటాయనీ, పోలీసుల పనివిధానంపై మూడు నిమిషాల నిడివితో లఘుచిత్రాల పోటీలుంటాయని వివరించారు.

వాటిలో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తామని తెలిపారు. అలాగే, పోలీసుల త్యాగాలను గుర్తించేందుకు ట్యాంక్‌బండ్‌ మొదలుకుని పలు బహిరంగ ప్రదేశాల్లో వీకెండ్‌లలో పోలీసుల బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు అమరులయ్యారనీ, అందులో రాష్ట్రానికి చెందిన వారు ఐదుగురున్నారని తెలిపారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పలు సందర్భాల్లో కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ ప్రజల శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసుల సేవలను స్మరించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -