నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని బీజేపీ ఎంపీలు జగదీశ్ షెట్టార్, బీవై రాఘవేంద్ర ఆరోపణలు చేశారు. దీనిపై కర్ణాటక అధికార పక్షం కాంగ్రెస్ స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీహార్ ఎన్నికల కోసం కేబినెట్‌లోని మంత్రులంతా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి అవినీతి సొమ్మును తరలిస్తున్నారని బీవై రాఘవేంద్ర ఆరోపించారు. కర్ణాటక మంత్రులకు ఇదో వ్యాపారంగా మారిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గ సమావేశం నిర్వహించి బీహార్ ఎన్నికలకు నిధులు సమకూర్చేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారని జగదీష్ షెట్టార్ ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలపై సిద్ధరామయ్య స్పందిస్తూ, కర్ణాటక నుంచి ఐదు పైసలు కూడా బీహార్ ఎన్నికలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. గతంలో వారు ఇలాంటి పనులు చేసి ఉంటారని, ఇప్పుడు తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలు ఉంటే చూపించాలని డీ.కే. శివకుమార్ సవాల్ చేశారు. రాఘవేంద్ర నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని వ్యాఖ్యానించారు.