Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి 

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి 

- Advertisement -

రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి 
పాలకుర్తి, చెన్నూర్ రిజర్వాయర్ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం 
అభివృద్ధిలో పాలకుర్తిని అద్దంలా తీర్చిదిద్దుతా 
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టి అధిక లాభాలను పొందాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేరుశనగ విత్తనాలు, వరి ధాన్యం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కట్ట అంబికా సోనీ తో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆర్థిక ప్రగతిని సాధించాలని దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు నూతన వంగడాలను ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం రైతులకు అందిస్తుందని, మధ్య దళారీల ద్వారా కొనుగోలు చేసిన విత్తనాలు నాసిరకంగా ఉండడంతో రైతులు మోసపోతున్నారని తెలిపారు.

రైతులు ఆర్థిక ప్రగతిని సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వమే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని అన్నారు. రైతుల పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని సదుద్దేశంతో ముందస్తుగానే ఐకెపి, సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పతి రైతులకు ఇబ్బందులు కలగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కిసాన్ కపాస్ యాప్ ను ప్రారంభించిందని తెలిపారు. యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులతో పాటు రైతులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో రాష్ట్రంలోనే జనగామ జిల్లాకు ప్రాధాన్యత లభించిందని, జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేసి చివరి ఆయ కట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. రాబోవు రెండేళ్లలో రిజర్వాయర్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తిలో మినీ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అభివృద్ధిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అద్దంల తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ తో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, పేదలకు సన్న బియ్యం పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు.

వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శం : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. పాలకుర్తి రైతు వేదికలో విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి యోజన పథకంలో దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేశారని తెలిపారు. తెలంగాణలో నాలుగు జిల్లాలను ఎంపిక చేశారని, నాలుగు జిల్లాల్లో జనగామ జిల్లా ఉండడం అభినందనీయమన్నారు. జనగామ జిల్లాలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలు ఉండడం ఈ ప్రాంత రైతుగా ఆర్థిక అభివృద్ధికి దిక్సూచి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగ, ఉత్పాదక వనరుల అభివృద్ధిపై ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో శాస్త్రవేత్తల పరిశోధనలు కొత్తరకం వంగడాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రైతులు పంటల మార్పిడి పై దృష్టి పెట్టాలని, ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతిని సాధించాలని సూచించారు. పంటల నమోదు కార్యక్రమం 85% మాత్రమే పూర్తయిందని మిగతా 15% పూర్తి చేయాలని, రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ కంహపాస్ యాప్ రైతులకు వరం లాంటిదన్నారు. పత్తి విక్రయాల సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ను వేశపెట్టిందని, రైతులు పత్తిని విక్రయించుకునే ముందు స్లాట్ బుక్ చేసుకుని అందుబాటులో ఉన్న సిసిఐ కేంద్రాలకు తీసుకువెళ్లాలని సూచించారు. రైతులకు మరింత ఆదాయ వనరులను పెంపొందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.

నూతన వంగడాలతో అధిక దిగుబడులు సాధించి పాలకుర్తి నియోజకవర్గ రైతులు జిల్లాకు, రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, తహసిల్దార్ నాగేశ్వర చారి, పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి సింగారపు కరుణాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యులు ఎండి మదర్, నాయకులు పోగు శ్రీనివాస్, కమ్మగాని నాగన్న గౌడ్, బండిపెళ్లి మనమ్మ లతోపాటు రైతులు, నాయకులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -