– మద్యం పారింపుపై ఉన్న శ్రద్ధ మెడిసిన్‌పై లేదు
– ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ : ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు
– పలు బస్తీ దవాఖానల సందర్శన
నవతెలంగాణ – బంజారాహిల్స్/ శేరిలింగంపల్లి
బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మద్యం దుకాణాలు.. ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ ఆస్పత్రులకు మెడిసిన్ సరఫరా చేయడంలో లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోకపోతే త్వరలోనే ప్రతి బస్తీ దవాఖాన ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్‌లో, రంగారెడ్డి జిల్లా ఓల్డ్ లింగంపల్లిలోని బస్తీ దవాఖానలను మంగళవారం కేటీఆర్, హరీశ్‌రావు సందర్శించారు. మందులు, పరికరాల పని తీరు, వైద్య సేవల వివరాలను రోగులు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే గురుబ్రహ్మనగర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించి చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దవాఖానలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్తీ దవాఖానలను నిర్లక్ష్యం చేసి, ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. నాలుగు, ఐదు నెలలుగా సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, దవాఖానల్లో మందులు అందుబాటులో లేవని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభు త్వానికి ప్రజారోగ్యంపై చింతే లేదన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నాలుగు వైపులా టిమ్స్ ఆస్పత్రులు ప్రారంభించామని, వాటిలో 90 శాతం పనులు పూర్తయ్యాయని కేటీఆర్ తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌ను రేవంత్ గాలికి వదిలేశారన్నారు. ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఆయన ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేకపోతున్నారని, వాళ్లకి సిగ్గనిపిస్తలేదా అని ప్రశ్నించారు. స్పీకర్ దగ్గర వారు పార్టీ మారలేదని అబద్దాలు చెబుతున్నారని అన్నారు.
మెడిసిన్స్ లేవ్.. : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
బస్తీ దవాఖానల్లో మందులు లేవని, 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 40 రకాల మందుల సరఫరా లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా ఓల్డ్ లింగంపల్లిలోని బస్తీ దవాఖానను మంగళవారం బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి స్థితిగతులపై వైద్య సిబ్బందితో ఆరా తీశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. 110 రకాల మందులు ఉచితంగా అందించామని, 130 రకాల పరీక్షలు చేసి పేషంట్ల ఫోన్లకే రిపోర్టులు పంపించే వాళ్లమని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పాలనలో మెడిసిన్స్ కరువయ్యాయని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 వాహనం సకాలంలో రాకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణం పోయిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్టు ఇవ్వకపోవడంతో 20 శాతం ప్రసవాలు ప్రయివేట్ ఆస్పత్రులకు బదిలీ అయ్యాయన్నారు. రేవంత్‌రెడ్డికి ఎంతసేపు మద్యం దుకాణాలు పెంచుదామా, పైసలు ఎట్ట సంపాదిద్దామా అని తప్ప వేరే ఆలోచన లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపాలంటే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు రంగారావు, అదర్స్ రెడ్డి, రవియాదవ్, రోజా కలిదిండి, శ్రీకాంత్ ఉన్నారు.