Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తి కొనుగోళ్లు ప్రారంభం

పత్తి కొనుగోళ్లు ప్రారంభం

- Advertisement -

– 317 జిన్నింగ్‌ మిల్లులకు గుర్తింపు
– నేచురల్‌ ఫార్మింగ్‌కు ప్రాధాన్యమిస్తాం
– రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌-ఫ్రీ నెంబర్‌ 1800 599 5779
పప్పుదినుసుల వంగడాల పంపిణీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా 317 జిన్నింగ్‌ మిల్లులు గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో, 24న నల్లగొండలో సీసీఐ కేంద్రాలు ప్రారంభమవుతాయన్నారు. మిగతా జిల్లాల్లోనూ త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 599 5779 ఏర్పాటు చేశామనీ, ఆ నెంబర్‌ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరించేందుకు ఒక సీనియర్‌ అధికారిని నియమించామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు మేలైన పప్పుదినుసుల వంగడాలు కుసుమ, పొద్దుతిరుగుడు విత్తనాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. గత సీజన్‌లో ప్రతి జిల్లాలోనూ ఎంపిక చేసిన ఒక మండలంలో 1,39,000 మట్టి నమూనాలు సేకరించి, వాటి విశ్లేషణ పూర్తి చేసి ఫలితాలు రైతులకు అందజేశామనీ, త్వరలో ఇంకో 1,70,000 మట్టి నమూనా ఫలితాలు అందుతాయని వివరించారు. నేచురల్‌ ఫార్మింగ్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదనీ, ఇప్పటికే క్లస్టర్లను గుర్తించి శిక్షణ కూడా పూర్తిచేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో అమలయ్యే పథకాలన్నింటికీ పునరుద్ధరిస్తూ పోతున్నామని చెప్పారు. గత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రూ.3 వేల కోట్ల మేర రైతులు నష్టపోయారని వాపోయారు. వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని వివరించారు. 2025-26లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామనీ, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీసీఐ తీసుకొచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారనీ, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి పంటను అమ్ముకో వడానికి స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతులు తమ ఫోన్‌ నెంబర్లను అప్‌డేట్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించామన్నారు. ఏఈఓను సంప్రదించి మొబైల్‌ నెంబర్‌ను అప్డేట్‌ చేసుకోవచ్చనీ, దీని ద్వారా మరసటి రోజు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. దళారుల మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రతిజిల్లాలోనూ మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మార్కెట్లలో టార్పాలిన్‌ కవర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశిం చారు. కేంద్రం చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్న దన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమ య్యాయని తెలిపారు. ఇప్పటిదాకా 220 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -