నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఊహించని రీతిలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు భారీగా తరలిరావడంతో అధికారులు అర్ధరాత్రి వరకు వాటిని స్వీకరించాల్సి వచ్చింది. ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆసక్తికరంగా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి ఆరు రోజుల్లో కేవలం 94 నామినేషన్లు మాత్రమే రాగా, చివరి రోజు ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు ఏకంగా 194 నామినేషన్లు సమర్పించడం గమనార్హం. చివరి గంటల్లో అభ్యర్థులు పోటెత్తడంతో నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా ముగిసింది.
అధికారులు ఈరోజు ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీని తుది గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. గడువు ముగిశాక బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారనే దానిపై స్పష్టత రానుంది. ఈ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.