Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅమెరికా జోక్యమేంటి?

అమెరికా జోక్యమేంటి?

- Advertisement -

– కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించిన సీపీఐ(ఎం)
– ప్రపంచానికి అధ్యక్షుడిగా ట్రంప్‌ భావిస్తున్నారని ఎద్దేవా

అగర్తల: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యాన్ని సీపీఐ (ఎం) తీవ్రంగా నిరసించింది. భారత్‌, పాకిస్తాన్‌ కంటే ముందుగానే కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలా ప్రకటన చేశారో వివరించాలని కేంద్రాన్ని కోరింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలలో విలేకరులతో మాట్లాడుతూ ‘ద్వైపాక్షిక సమస్యలపై మూడో పక్షం మధ్యవర్తిత్వం అవాంఛనీ యమన్నది మా పార్టీ విధానం. ద్వైపాక్షిక సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించు కోవాలి’ అని అన్నారు. అగర్తలలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశానికి బేబీ హాజరయ్యారు. ‘దేశీయంగా ఉన్న సమస్యలను, పొరుగు దేశాలతో ఉన్న సమస్యలను అంతర్జాతీయం చేయడం ఆమోదయోగ్యం కాదని భారత ప్రభుత్వం కూడా గతంలో భావించింది. పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా, పరస్పర ఆమోదయోగ్యమైన పద్ధతిలో పరిష్క రించుకోవాల్సి ఉంటుంది.వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలు సడలుతు న్నాయి. కాల్పుల విరమణపై అందరి కంటే ముందుగా నే అమెరికా అధ్యక్షుడు ఎలా ప్రకటించారో ప్రభుత్వం వివరించాలి’ అని బేబీ అడిగారు. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలలో జోక్యం చేసుకోవాలని అమెరికా భావించడం లేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గతంలో చేసిన వ్యాఖ్యను బేబీ ప్రస్తావించారు. ‘తాను ప్రపంచానికే అధ్యక్షుడిననే విధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తు న్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు. భారత సైనిక ఆపరేషన్ల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంఓ)తో పాకిస్తాన్‌ డీజీఎంఓ మాట్లాడిన తర్వాత కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిందని విదేశాంగ కార్యదర్శి చేసిన ప్రకటనను బేబీ గుర్తు చేస్తూ ట్రంప్‌ చెబుతున్న మాటలకు దీనితో పొంతన కుదరడం లేదని బేబీ చెప్పారు.
బీజేపీ కూటమిలో భిన్నాభిప్రాయాలు
కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఉగ్రవాదం, ఉగ్రవాదులపై పోరు కొనసాగుతూనే ఉంటుందని త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ సాహా స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటలలోనే ఉల్లంఘనలు జరగడంపై ఆయన స్పందిస్తూ ‘అవును. నేను కూడా గుర్తించాను. చివరికి వారు వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం’ అని అన్నారు. కాగా అమెరికా జోక్యంతో కుదిరిన కాల్పుల విరమణపై బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ‘మధ్యవర్తిత్వానికి వచ్చిన ప్రతిసారీ మనం అమెరికా మాటలు వినాలో లేదో కాలమే నిర్ణయిస్తుంది. హమాస్‌/ఇజ్రాయిల్‌ యుద్ధం వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం నెరిపేందుకు అమెరికా ఇంతగా తొందరపడలేదు. ఏదేమైనా యుద్ధం లాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మన దళాలు వీరోచితంగా పోరాడడం గర్వకారణం. గతంలో మాదిరిగా సింధు నదీ జలాలు పాకిస్తాన్‌లో ప్రవహించకుండా చూస్తారని ఆశిస్తున్నాను’ అని తిప్రా మోతా వ్యవస్థాపకుడు ప్రద్యోత్‌ కిషోర్‌ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad