నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని ఓ కుగ్రామం నుంచి వెళ్లిన వైద్యుడు విదేశంలో హీరోగా నిలిచారు. అతి తక్కువ ఫీజుతో పేదలకు వైద్యం అందిస్తూ ‘ఫైవ్ బిల్స్ డాక్టర్’గా జమైకా ప్రజల మన్ననలు పొందుతున్న తెలుగు వ్యక్తి డాక్టర్ చందోలు నాగమల్లేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సేవలను గుర్తించిన జమైకా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్’తో సత్కరించింది. ఈ నెల 20న జరిగిన జమైకా జాతీయ హీరోల దినోత్సవం సందర్భంగా కింగ్‌స్టన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ చేతుల మీదుగా నాగమల్లేశ్వరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న ఆయనకు కింగ్‌స్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది.
బాపట్ల జిల్లా నగరం మండలం బెల్లంవారిపాలేనికి చెందిన నాగమల్లేశ్వరరావుది ఓ నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి రిక్షా కార్మికుడు. అయినప్పటికీ, కష్టపడి చదివిన నాగమల్లేశ్వరరావు చిలకలూరిపేట మండలం మద్దిరాల నవోదయలో ఇంటర్మీడియట్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను పూర్తి చేశారు. అనంతరం 2005లో ఆయన జమైకా వెళ్లారు. జమైకా వెళ్లిన తర్వాత అక్కడ పేదల వైద్యుడిగా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. ‘చందోలు గ్లోబల్ హెల్త్‌కేర్ ప్రాక్టీస్’ పేరిట ఓ సంస్థను స్థాపించి, అనేక వైద్య శిబిరాలు నిర్వహించారు. జమైకాలోనే అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజుతో వైద్యం చేస్తుండటంతో స్థానికులు ఆయన్ను ముద్దుగా ‘ఫైవ్ బిల్స్ డాక్టర్’ అని పిలుచుకుంటారు. ఈ నిస్వార్థ సేవకే ఆయనకు ఇప్పుడు ఈ గౌరవం లభించింది.