– విద్యావ్యవస్థలో మార్పు రావాలి
– ప్రయివేటుకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలి
– నిబంధనలకు విరుద్ధంగా ఉండే విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలి
– అంతర్జాతీయ ప్రమాణాలతో వెయ్యి ప్లేస్కూళు:్ల విద్యారంగంలో సంస్కరణల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో శ్రీధర్‌బాబు
– తల్లిదండ్రులు, ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాల అభిప్రాయాల సేకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యావ్యవస్థలో సమూల మార్పు రావాల్సిన అవసరముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత పదేండ్లలో రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని చెప్పారు. ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై తల్లిదండ్రులు, సంబంధింత యాజమాన్యాల అభిప్రాయాలను సేకరించామనీ, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ‘విద్యా రంగంలో సంస్కరణలు’ అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశాన్ని మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. తల్లిదండ్రులు, ప్రయివేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యా శాఖాధికారులతో సుమారు అయిదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా ఉండేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చకు వచ్చింది. ఇతర రాష్ట్రాల అధికారులు తెలంగాణకొచ్చి అధ్యయనం చేసేలా మార్పు తీసుకురావాలని సంబంధిత మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ప్రయివేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని వివరించారు. సర్కార్ బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంపొందించి, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడి విద్యార్థులను చిన్నతనం నుంచే ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో నిపుణులు తీర్చిదిద్దేలా సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్కార్ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులుగా తీర్చి దిద్దేందుకు కావాల్సిన శిక్షణపై సమావేశంలో చర్చించామని వివరించారు. ఇప్పటికే డీఈవోలకు మూడురోజులపాటు ప్రత్యేక క్యాంప్ నిర్వహించామనీ, సత్ఫలితాలొచ్చాయని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు వివరించారు.
డీఈవో, ఎంఈవోలు క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించి లోపాలను సరి చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రయివేట్ విద్యాసంస్థలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల భద్రత ముఖ్యమనీ, ఈ అంశంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ కొనసాగిస్తారా… మార్కులు ఇస్తారా.. లేదా ఈ ఏడాది మాదిరిగానే రెండింటిని కొనసాగిస్తారా అనే అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు ముందు నుంచే అవగాహన కల్పించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిచ్చే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ)ని తప్పనిసరిగా అమలు చేస్తామనీ, ఇందుకోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. విద్యార్థులకు మరింత పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కామన్ డిటెన్షన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించామని చెప్పారు. ఒకే రకమైన పరీక్షా ఫీజును కూడా రూపొందిస్తామన్నారు. 2025-26 నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వేయి ప్లే స్కూల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించబోతున్నట్టుగా వివరించారు. ప్రయివేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి సీఎస్‌ఆర్ నిధులతో వాటిని దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతామన్నారు.
ఇక్కడి కరిక్యులమ్, ట్రైనింగ్ మెటీరియల్‌ను ఎస్‌సీఈఆర్‌టీ నిపుణుల భాగస్వామ్యంతో రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా, ప్రత్యేక కార్యదర్శి హరిత, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ట్రస్మా ప్రతినిధులు ఎస్‌ఎన్ రెడ్డి, మధుసూదన్, హెచ్‌ఎస్పీఏ నుంచి వెంకట సాయినాథ్, ఇస్మా ప్రతినిధులు సునీల్ కుమార్, వైసీ చౌదరి, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నుంచి అన్వర్ అహ్మద్, క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున బాలశౌరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫీజుల నియంత్రణపైత్వరలో నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES