సినిమా పాటలు పాడటం వేరు. జానపద పాటలు పాడటం వేరు. ఇక అన్నమాచార్యుల సంకీర్తనలు ఆలపించడమంటే అంత సులభం కాదు. కష్టమైన ఈ సంకీర్తనలు పాడాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. అలాంటి పాటలను ఆమె అవలీలగా పాడేస్తున్నారు. దశాబ్ద కాలంగా అన్నమయ్య కళా సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ విద్యార్థులకు సంగీతం నేర్పిస్తున్నారు. కరోనా కంటే ముందు ఆఫ్ లైన్‌లో సంగీత పాఠాలు నేర్పించారు. ప్రస్తుతం ఆన్ లైన్‌లో సంకీర్తనలు, సంగీత పాఠాలు నేర్పుతున్నారు. ఇలా ప్రతి ఇంటా అన్నమయ్య సంకీర్తనలు వినపడాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారు గండేపల్లి సుమలత. ప్రముఖ గాయని, అన్నమయ్య కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలైన ఆమెతో మానవి సంభాషణ…
మీ బాల్యం గురించి చెప్పండి?
నల్లగొండలో పుట్టి పెరిగాను. అమ్మ పులిజాల విజయ, నాన్న పృథ్వీదర్ రావు. చిన్నతనం నుండే నాకు సంగీతమంటే ఎంతో ఇష్టం. దేవాలయాలలో భక్తి గీతాలు పాడుతుండేదాన్ని. అన్నమయ్య సంకీర్తనలపై మక్కువ ఎక్కువ. 1989లో 10వ తరగతి తర్వాత 16 ఏండ్ల వయస్సులో నకిరేకల్‌కు చెందిన గండేపల్లి నరసింహారావుతో నా వివాహం జరిగింది. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో కొంత కాలం బిజీగా ఉన్నాను. 17 ఏండ్ల విరామం తర్వాత మధ్యలోనే ఆగిపోయిన నా చదువును కొనసాగించాను. నకిరేకల్‌లోని ఏవీఎం కళాశాలలో దూరవిద్య విధానంలో డిగ్రీ, ఎంఏ తెలుగు పూర్తి చేశాను. ఆ తర్వాత అదే కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా, మరో ఆరేండ్లు నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రవేటు ఉద్యోగిగా పని చేశాను.
అన్నమయ్య సంకీర్తనల వైపు దృష్టి ఎలా మళ్లింది?
చిన్నతనం నుండే సంగీతమంటే ఇష్టం ఉండటం వల్ల డాక్టర్ ముడుంబై పురుషోత్తమచార్యుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. వివిధ దేవాలయాలలో భక్తి గీతాలు పాడుతుండడంతో అన్నమయ్య కీర్తనలపై మక్కువ పెరిగింది. దీంతో తొలిసారిగా ఆన్ లైన్‌లో ఇనుపకుతిక సుబ్రహ్మణ్యం వద్ద సంగీతం అభ్యసించి ఇంకా సంగీతంలో మెలకువలు నేర్చుకోవాలన్న అభిలాషతో గరికపాటి వెంకట ప్రభాకర్ వద్ద సంగీత విద్యను అభ్యసించాను. అలా సంగీతం నేర్చుకుంటూనే వివిధ వేదికలపై కీర్తనలను ఆలపిస్తూ ఆ విద్యను అందరికీ తెలియజేయాలన్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా 2016లో ఆఫ్ లైన్‌లో నకిరేకల్ పట్టణంలో సంగీతం నేర్పించడం మొదలుపెట్టాను.
ఆన్ లైన్ సంగీత శిక్షణ ఎలా సాగుతుంది..?
కేవలం శాస్త్రీయ సంగీతం నేర్పిస్తే బోర్‌గా ఫీల్ అవుతారని ఆలోచించి అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తున్నాను. ఆన్‌లైన్ సంగీత తరగతులకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పటికీ సుమారు 500 మంది నా వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రస్తుతం 40 మంది నేర్చుకుంటున్నారు. నాలుగేండ్ల నుండి 50 ఏండ్ల వయసు వాళ్ల వరకు నా వద్ద సంగీతం నేర్చుకుంటానికి వస్తున్నారు. తమ జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేస్తూనే ఖాళీ సమయంలో ఆన్ లైన్ ద్వారా సంగీతాన్ని నేర్చుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుండే కాకుండా దేశంలోని జమ్మూ, జార్ఖండ్ రాష్ట్రాలు, అమెరికా, కెనడా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్ దేశాల నుండి కూడా క్లాసులకు హాజరవుతున్నారు. రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలలో పాటలు పాడుతూ ఎస్పీ బాలు, సాలూరు వాసు దేవరావు, మాధవ పెద్ది సురేష్ లాంటి ఎంతో మంది అభిమానాన్ని అందుకుంటూ పలువురి ఆత్మీయతను చూరగొంటున్నాను.
అన్నమయ్య పద సుమార్చనం ఎలా కొనసాగుతుంది?
ప్రతినెల అన్నమయ్య పద సుమార్చనం కార్యక్రమాన్ని ఆన్ లైన్‌లో ఒక గంట పాటు చిన్నారులతో నిర్వహిస్తున్నాం. 50 నెలలుగా ఈ కీర్తనలు ఆన్ లైన్‌లోనే పాడిస్తున్నాం. వారికి శృతి, లయ పట్ల అవగాహన కల్పిస్తూ పలు దేశాలలో ఉన్న చిన్నారులతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నాం. భజన్ దర్బార్ అనే భక్తి ఆల్బమ్‌లో చిన్నారులతో చక్కటి భక్తి పాటలు పాడించాం. నల్లగొండ అన్నమయ్య సంకీర్తన ప్రచార సమితి 484 మాస కార్యక్రమంలో అంతర్జాల విద్యార్థులచే అన్నమయ్య కీర్తనలు రామాలయంలోని అన్నమయ్య వేదికపై పాడించాం. ఆరేళ్ల చిన్నారులు మొదటిసారి వాద్య సహకారంతో తమ లేత గొంతులతో కీర్తనలు ఆలపించి అందర్నీ అలరించారు.
అన్నమయ్య కళా సమితి లక్ష్యం ఏమిటి ..?
చిన్నారులకు సంగీతంతో పాటు అన్నమయ్య కీర్తనలు, లలిత సంగీతం, సినీ సంగీతం నేర్పించాలన్నదే మా సమితి లక్ష్యం. ఈ నా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అయినా నా లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టను. 2016లో అన్నమయ్య కళా సమితి స్థాపించాము. ఇప్పటికి పదేండ్లు గడిచిపోయాయి. ఈ కాలంలో ఎన్నో విజయాలు లభించాయి. ప్రముఖ దేవాలయాలైన యాదగిరిగుట్ట, చిలుకూరు, తిరుపతితో పాటు వివిధ దేవాలయాలలో అన్నమయ్య సంకీర్తనలకు ప్రజాదరణ లభిస్తుంది. అంతేకాకుండా మా కళా సమితి చిన్నారులతో నవంబర్ నెలలో సప్తగిరి, ఎస్వీబీసీ చానల్స్‌లో వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3200 అన్నమయ్య సంకీర్తనలు పాడాలన్న లక్ష్యం పెట్టుకున్నాం. అన్నమాచార్యుల కొత్త కొత్త సంకీర్తనలు వెలికి తీయడం మా ఆశయం.
మీకు లభించిన అవార్డులు..?
సంగీత నేపథ్యంలో మా పిల్లలతో కలిసి ఎన్నో అవార్డులు సాధించాం. 2023లో 30 మంది, 30 నిమిషాలలో 30 సంకీర్తనలు ఆలపించి వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు, అదే ఏడాది సెప్టెంబర్‌లో 40 మంది, 40 నిమిషాలలో 40 సంకీర్తనలు ఆలపించి గోల్డెన్ స్టార్ వరల్డ్ బుక్ రికార్డు సాధించాం. 2023 సెప్టెంబర్‌లో జీనియస్ వరల్డ్ బుక్ రికార్డు, ఘంటసాల మాస్టారు 365 రోజుల పాటల కార్యక్రమంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాం. 2023 డిసెంబర్‌లో కాకతీయ మహానంది అవార్డు, మయూరి ఆర్ట్స్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023లో రికార్డు ప్రోగ్రాంలో పాల్గొని ఆరు నిమిషాలలో 11 కీర్తనలు పాడి ఒకేసారి 10 రికార్డులు నెలకొల్పాం. 2025 సెప్టెంబర్‌లో 100 మందితో 72 మేళకర్త రాగాల కీర్తనలు 36 నిమిషాలలో పాడి మూడవసారి తెలుగు బుక్ రికార్డ్‌లో చోటు దక్కింది. సెప్టెంబర్ 7న నకిరేకల్ పట్టణంలో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు నిర్విరామ అన్నమాచార్య సంకీర్తనగానం 120 సంకీర్తనలు, 60 మంది, 12 గంటల రికార్డు చేసి జీనియస్ బుక్ రికార్డ్‌లో చోటు లభించింది.
- యరకల శాంతికుమార్, 9849042083