అక్టోబరు పద్దెనిమిది! అమెరికా చరిత్రలో మరో చారిత్రక ఘట్టం!! డెబ్బయి లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు భుజం భుజం కలిపి 50 రాష్ట్రాలలోని 2,700 చోట్ల డోనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన ఉదంతం. జనవరి 20వ తేదీన రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఏడాది గడవక ముందే జరిగిన మూడవ సామూహిక నిరసన ఇది. ఒక వైపున అక్టోబరు ఒకటవ తేదీ నుంచి ఎప్పుడు ముగుస్తుందో తెలియని ఫెడరల్ ప్రభుత్వ మూసివేత కొనసాగుతున్నది. లక్షల మందికి వేతనాలు లేవు. సేవలకు అంతరాయం కలిగింది. నోబెల్ శాంతి బహుమతి పొందటానికి తహతహ, పైరవీల మీద ఉన్న శ్రద్ద ఆ ప్రతిష్టంభనను తొలగించేందుకు ట్రంప్‌వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమ వైఖరులకు కట్టుబడి ఉన్నాయి. మధ్యలో ఉద్యోగులు, ప్రభుత్వ సేవలను అందుకొనే లబ్దిదారులు ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ‘అమెరికాకు రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాలు లేవు’ అనే నినాదంతో జనం కదిలారు.
అంతేకాదు ‘మేం ఎవరికీ సేవకులం కాదు’ అంటూ గళమెత్తారు. ఏప్రిల్‌లో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంపు పేరుతో ట్రంప్ మాజీ సహచరుడు ఎలన్ మస్క్ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. జూన్ 14న తొలిసారి ‘రాజులు లేరు’ అనే నినాదంతో నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అప్పుడు ఆ పిలుపును చూసి కొందరు ఆ జరిగేదేనా అంటూ పెదవి విరిచారు. ఆ రోజు ట్రంప్ 79వ పుట్టిన రోజు, అమెరికా పతాక దినోత్సవం, అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవం. మూడు సందర్భాలను కలిపి చరిత్రలో రాజులు, రంగప్పలు జరుపుకున్న మాదిరి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా కోట్లాది డాలర్ల జనం సొమ్ముతో అంగరంగవైభవంగా జరుపుకోవాలని ట్రంప్ నిర్ణయించాడు.
బహుశా ఆ ఏర్పాట్లను చూసి అమెరికా కార్మికవర్గం అదే రోజున రాజులు లేరు అనే నినాదంతో అమెరికా అంతటా తొలిసారి ప్రదర్శనలు చేసింది.యాభై లక్షల మంది వాటిలో పాల్గొన్నారు.ట్రంప్ జన్మదిన ఆర్భాటం బోసిపోయింది. అధ్యక్ష భవనం స్వయంగా ప్రకటించిన మేరకే పాల్గొన్నది రెండున్నర లక్షల మందే, మీడియా అంచనాలు అంతకంటే తక్కువ. కార్మికవర్గ హోరుజోరు మధ్య ట్రంప్ కార్యక్రమం వెలవెల పోయింది.ప్రపంచానికి కార్మికుల నిరసన తప్ప అభినవ రాజు ట్రంప్ ఆర్భాటం కనిపించలేదు. పోల్చేందుకు కూడా మీడియా సిగ్గుపడింది. ఇప్పటివరకు జరిగిన మూడు ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా కార్మికవర్గాన్ని రెచ్చగొట్టేందుకు అనేక విధాలుగా చూశారు.
అశేషంగా జనం పాల్గ్గొన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క అవాంఛనీయ ఉదంతం కూడా జరగలేదు. జూన్ 14 ప్రదర్శనల తర్వాత ట్రంప్ యంత్రాంగం అనేక పట్టణాల్లో చట్టవిరుద్దంగా మిలిటరీని దించుతామంటూ బెదిరిస్తున్నది. అవినీతి సరేసరి, వలస వచ్చిన కుటుంబాల మీద దాడులు పెరిగాయి, అరెస్టులు సర్వసాధారణంగా మారాయి. ఇలా ఒకటేమిటి చివరికి న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టు జోహ్రాన్ మమ్దానిని గనుక ఎన్నుకుంటే మిలిటరీని దించటంతో పాటు నగరానికి నిధులు నిలిపివేస్తానని బాహాటంగా బెదిరించాడంటే నిరంకుశ పోకడలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
వీటికి తోడు అమెరికా దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల విధింపుతో ధరలు, ద్రవ్యోల్బణంతో జీవన వ్యయం పెరుగుతున్నది. ఎక్కువ మంది పౌరులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ, విద్యారంగాలతో పాటు పర్యావరణ రక్షణ కేటాయింపులను కూడా ట్రంప్ సర్కార్ కోత పెడుతున్నది.మరో వైపు భారీ ఎత్తున కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు.మిలిటరీ ఖర్చు పెరుగుతున్నది, ఇజ్రాయిల్, ఉక్రెయిన్లకు ఆయుధాలు, నిధులు అందచేస్తున్నారు. అపరిమిత అధికారాలు చెలాయించకుండా రాజ్యాంగం ఏర్పాటు చేసిన అడ్డుగోడలను తన అధికారాలతో బద్దలు కొడుతూ ప్రతిరంగంలో ప్రజాస్వామిక వ్యవస్థలను అపహాస్యం పాలు చేస్తూ నిరంకుశ, ఫాసిస్టు తరహా విధానాలవైపు మొగ్గు చూపుతున్నాడు. వీటన్నింటికీ నిరసనే రాజులు లేరు అనే నినాదంతో జన సమీకరణ. దీనికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారి మద్దతు ఉంది, కమ్యూనిస్టుల భాగస్వామ్యం కూడా ఉన్నప్పటికీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, వివిధ హక్కుల వేదికలు, స్థానిక ప్రజా సమూహాలదే ప్రధాన భాగస్వామ్యం.
ఈ నిరసనలో కొన్ని అంశాలకు అంటే యుద్ధ వ్యతిరేకతకు ప్రాధాన్యత లేదని, మిలిటరీ బడ్జెట్లకు వ్యతిరేకత తెలపటం లేదని దానికి కారణం ఒక భాగస్వామిగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ కూడా అధికా రంలో ఉన్నపుడు గాజాలో ఇజ్రాయిల్ మారణ కాండకు, రష్యా మీద పోరులో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వటమే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయ నవసరం లేదు. దీని పర్యవసానాల గురించి అమెరికా పాలకవర్గం గుర్తించి భయపడుతున్నట్లు ట్రంప, ఇతరులలో వెలువడుతున్న స్పందనే నిదర్శనం. రెండవసారి ఓడిపోయినపుడు ఇదే ట్రంప్ ఓటమిని అంగీకరిం చకుండా 2021 జనవరి ఆరున అమెరికా అధికార కేంద్రమైన కాపిటోల్ హిల్ మీద దాడికి దిగిన అతగాడి అను చరులు దేశ భక్తులు అన్న ట్లుగా అధికారానికి వచ్చిన తర్వాత ట్రంప్ శిక్షలను రద్దుచేశాడు. తన విధానాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో శాంతి యుతంగా ప్రదర్శనలు చేస్తున్నవారిని ఉగ్రవాదులని వర్ణిస్తున్నాడు.
కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ మూతను మరింతగా పొడిగించేందుకు డెమోక్రటిక్ పార్టీ చేసిన కుట్రలో భాగమే ఇదంటూ మంత్రులు, రిపబ్లికన్ పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గ్గొన్నవారికి డబ్బిచ్చి రప్పించారని రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ ఆరోపించాడు. సెనెటర్ టెడ్ క్రజ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో ఈ ప్రదర్శనలను అమెరికా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిందన్నాడు. వారంతా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు అంటూ నిందించాడు. నిర్వాహకులను సంతుష్టీకరించేందుకు డెమోక్రటిక్ పార్టీ తొందరపడుతున్నదన్నాడు. అంతకు ముందు మానహటన్ సంస్థ మేధావి, విశ్లేషకుడు స్టుస్మిత్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనల సందర్భంగా ముద్రించిన పోస్టర్లలో పిలుపుకు మద్దతుదార్ల జాబితాలో కమ్యూనిస్టు పార్టీ గుర్తు కూడా ఉందన్నాడు.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని అమెరికా కమ్యూనిస్టు పార్టీ సహ అధ్యక్షుడు జో సిమ్స్ ప్రదర్శనలకు ఒక రోజు ముందు అపహాస్యం చేశాడు.
దోనాల్డ్ ట్రంప్, ఎఫ్‌బిఐ అధిపతి కాష్ పటేల్ వంటి వారెవరూ రాజులు లేరు ప్రదర్శనలను నిరోధించలేరని స్పష్టం చేశారు. సిమ్స్ అన్నట్లుగానే తప్పుడు ప్రచారాలేవీ ప్రదర్శకులను నిరోధించలేకపోయాయి. ఈ ప్రదర్శనలను నిర్వహించేది కమ్యూనిస్టు పార్టీ కాదనేది అందరికీ తెలుసు. ప్రతిదాన్నీ కమ్యూనిస్టులే నియంత్రిస్తున్నారనే ప్రచారం పాతచింతకాయ పచ్చడి, పనికిమాలింది, తప్పుడు ప్రచారం, దీన్ని అమెరికా ప్రజానీకం ప్రతి సందర్భంలోనూ పట్టించుకోలేదని జో సిమ్స్ చెప్పాడు.ఈ దేశం చట్టాలమేరకు నడుస్తుంది తప్ప రాజులతో కాదని అమెరికా స్థాపకులకు స్పష్టంగా తెలుసునని టీచర్స్ యూనియన్ అధ్యక్షురాలు రాండీ వెయిన్‌గార్టెన్ అన్నారు. రాజ్యాంగానికి బద్దులమై పని చేస్తామని గద్దెనెక్కిన వారు దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆమె విమర్శించారు. అధ్యక్షుడు ప్రజా సమస్యలను పరిష్కరించాలి తప్ప హక్కులను హరించకూడదన్నారు.
రాజులు లేరు ఆందోళనలో యుద్ధ సంబంధ అంశాలు లేవని చెబుతున్నవారు లేవనెత్తిన వాటితో ఏకీభవించటమా లేదా అన్నదాన్ని పక్కన పెడితే అవేమిటో చూడాల్సి ఉంది. వివిధ దేశాల్లో జరిగిన పరిణామాలకు రంగుల విప్లవాలని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. రాజులు లేరు అన్న ప్రదర్శనలకు పిలుపునిచ్చిన వారి వెబ్‌సైట్‌ను చూస్తే నిరసన ప్రదర్శ నల్లో పసుపు పచ్చ రంగు వాటిని ధరించాలని ప్రోత్సహించినట్లు ఉందని, ఐరోపాలో నాటో అనుకూల శక్తుల పసుపు రిబ్బన్ ఆందోళన, హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా పసుపు గొడుగుల ఆందోళనను గుర్తుకు తెచ్చిందనే వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. రాజులు లేరు అనే నినాదం వెనుక సమీకృతులౌతున్నవారు ఏ రంగు ధరించినప్పటికీ దానివెనుక ఉన్న అంశాలు ముఖ్యమన్నది మరొక వాదన. కార్మికవర్గం మీద భారాలు మోపటం, సంక్షేమ పథకాలకు కోత పెట్టటం ద్వారా పోగుపడే సొమ్మును ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతున్నదంటే వివిధ ప్రాంతాల్లో యుద్ధాలకు మళ్లిస్తున్నది, కార్పొరేట్లకు రాయితీలుగా ఇస్తున్నది.
ఈ ఆందోళనలో యుద్ద వ్యతిరేకత లేకపోవటానికి ముందే చెప్పుకున్నట్లుగా డెమోక్రాట్లు అనుసరించే విదేశాంగ విధానంలో యుద్దాలు,ఉద్రికత్తతలను రెచ్చగొట్టటం, ఆ ప్రాంతాల్లో ఆయుధాల అమ్మకం ద్వారా అమెరికాలోని ఆయుధ తయారీదార్లు, వ్యాపారులకు లబ్ది చేకూర్చటం దానికి డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఉండటమే అనేది ఒక వాస్తవం. తొలిసారి ట్రంప్ అధికారంలో ఉన్నపుడు డెమోక్రటిక్ పార్టీ నిరసన తెలిపింది, ఎందుకంటే కార్మికుల హక్కులను హరించినందుకు కాదని, రష్యా, చైనాల పట్ల మెతకగా వ్యవహరించటానికి వ్యతిరేకంగా అని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. అలాగే 2019లో ట్రంప్ మీద అభిశంసన ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటంలో ఆలశ్యం చేసినందుకు అన్నది కూడా తెలిసిందే. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో యుద్దాన్ని వ్యతిరేకిం చటాన్ని విడిగా చూడలేమని, అందువలన ఆ అంశాలను కూడా చేర్చాలన్నది కొందరి వాదన.
శనివారం నాటి ప్రదర్శనల్లో భారీ ఎత్తున కార్మికవర్గం పాల్గ్గొనటానికి అనేక అంశాలు దోహదం చేశాయి. దిగజారు తున్న జీవన పరిస్థితులు, మెరుగుపడుతుందనే ఆశలు సన్న గిల్లటం వంటి అనేక అంశాలున్నాయి. తక్షణ కారణాలలో కొన సాగుతున్న ప్రభుత్వ మూత ఒకటి, 1976 నుంచి అమెరికాలో ఇప్పటి వరకు పదిసార్లు కేంద్ర ప్రభుత్వం మూతపడింది. ఇదే ట్రంప్ ఏలుబడిలో 2018-19లో 35 రోజులు గరిష్టంగా నిలిచిపోయింది. ఆ రికార్డు బద్దలవుతుందని చెబుతున్నారు. ఇలా మూతపడేందుకు రిపబ్లికన్ పార్టీ అత్యధిక సందర్భాలలో కారకురాలైంది,కావాలనే మూతపడేట్లు చేసి బిలియనీర్లకు లబ్ధి కలిగించేందుకు చూసింది. మూత రాజకీయాలకు తెరలేచిన 1990వ దశకంలో 66మంది బిలియనీర్లు 240 బిలియన్ డాలర్లను అదుపు చేస్తే ఇప్పుడు 700 మంది ఏడు లక్షల కోట్ల దాలర్లకు చేరారు, ఇరవై ఎనిమిది రెట్ల సంపద పెరిగింది.
మూత సమయంలో కార్పొరేట్లు పన్నులు ఎగవేయటం, ఖర్చుల్లో కోత, వేతన మినహాయింపుల వంటి రకరకాల పద్ధతుల్లో కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి కలుగుతున్నందున మూసివేతలేవో అనుకోకుండా జరిగినవి కాదని అర్థమవుతున్నది. మధ్య తరగతిలో ఆశలు సన్నగిల్లుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. అనుకోకుండా ఏదైనా వైద్య అవసరం ఏర్పడితే ఖర్చు పెట్టుకోలేమని 47శాతం మంది, ఉద్యోగ విరమణ తర్వాత తగినంత డబ్బు ఉండదని 52శాతం, కొత్త ఇల్లు కొనుగోలు చేయలేమని 63శాతం మంది భావిస్తున్నారు. మూడు పదుల వయస్సులోపు యువతలో ఇలాంటి అవిశ్వాసం ప్రతి పది మందిలో ఎనిమిదికి ఉంది. ఒకసారి జగన్నాథ రథం కదలాలే గానీ దాన్ని ఆపలేరు అన్నట్లుగా అమెరికాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకత రానున్న రోజుల్లో ఏ మలుపులు తిరగనుందో ఊహించి చెప్పలేము!
ఎం.కోటేశ్వరరావు
8331013288