పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలి
కేంద్రం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
50 శాతం పరిమితి ఎత్తేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్
దేశాన్ని విభజించడమే ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా బీహార్‌లో బీజేపీని ఓడించాలి : పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రజా పోరాటాలను ఆపేది లేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు బీజేపీ అసెంబ్లీలో మద్దతిచ్చి, కేంద్రంలో అడ్డుకుంటున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తేనే బీసీలకు స్థానిక సంస్థలతోపాటు అన్ని రకాలుగా 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారని గుర్తు చేశారు.
రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించిందనీ, కేంద్రం, గవర్నర్ ఆమోదించకపోవడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవోను విడుదల చేసిందని వివరించారు. ఆ జీవోపై హైకోర్టు స్టే విధించిందనీ, సుప్రీంకోర్టు అప్పీల్‌ను కొట్టేసిందని తెలిపారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న రాష్ట్రబంద్ జరిగిందనీ, అన్ని రాజకీయ పార్టీలూ, సంఘాలు, సంస్థలు మద్దతిచ్చాయనీ, కేంద్రంలో బిల్లును అడ్డుకుం టున్న బీజేపీ కూడా ఈ బంద్‌లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మోసపూరిత వైఖరికి ఇదినిదర్శనమనీ, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్‌కు చెప్పి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనీ, ఆ క్యాబినెట్ ఏం సలహా ఇచ్చిందో వెల్లడించాలని కోరారు. బీజేపీ రాష్ట్రంలో ఓట్లు, ఇతర ప్రయోజనాల కోసం మోసపూరితంగా నాటకం ఆడుతూ, ప్రజల్ని మోసం చేస్తున్నదని అన్నారు.
‘సుప్రీం’ తీర్పులు ప్రజలకు నష్టదాయకంగా ఉన్నపుడు రాజ్యాంగ సవరణలు చేశారని గుర్తు చేశారు. కోర్టులు న్యాయం, అన్యాయం ప్రకారం కాకుండా చట్టబద్ధమా? కాదా?అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అవసరమైన రాజ్యాంగ సవరణ చేస్తే, బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం లేదని వివరించారు. బీజేపీకి, తెలంగాణలోని కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి చెప్పి రాజ్యాంగ సవరణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. అప్పుడు బీజేపీ నాటకం, కేంద్రం తీరు ప్రజల ముందు బట్టబయలవుతుందని విశ్లేషించారు. దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు.
విద్యుత్ సవరణలు అత్యంత ప్రమాదకరం
విద్యుత్ చట్టం-2003ను సవరించడం వల్ల క్రాస్ సబ్సిడీ ఉండబోదనీ, ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదముందని రాఘవులు చెప్పారు. ఆ సవరణలు తెలంగాణకు తీవ్ర నష్టదాయకమని అన్నారు. కేంద్రం ప్రజలకు నష్టం చేసే సవరణలను ఆగమేఘాల మీద చేస్తున్నదని విమర్శించారు. ఆ తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేరని ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతపై కూడా కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగంగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు.
విద్యుత్ సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంలు ప్రయివేటుపరం అవుతాయన్నారు. విద్యుత్ సంస్కరణలు ప్రజల కోసం కాదనీ, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు లాభం చేకూర్చడం కోసమేనని స్పష్టం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై రాజకీయ పార్టీలూ, ప్రజాసంఘాలూ, సంస్థలూ, మున్సిపాల్టీలు, మేధావులు విరివిగా కేంద్రానికి అభ్యంతరాలు పంపాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న కేంద్రం : విజయరాఘవన్
ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్ విమర్శించారు. దేశాన్ని, ప్రజలను విభజిం చడమే ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతవసంతాల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు వ్యతిరే కంగా ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు అభ్యం తరకరంగా ఉన్నాయన్నారు. మత విద్వేషాలను రెచ్చ గొడుతూ, జ్ఞానవాపి, మధుర వంటి అంశాలను వివాదా స్పదం చేస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. దేశంలో సామాన్యుల ఆర్థిక పరిస్థితి, ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు, నిరుద్యోగం, సామాజిక భద్రత వంటి అంశాలపై కేంద్రం దృష్టిసారించడం లేదనీ, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంభిస్తూ ప్రజలపై భారాలను మోపుతున్నారని వివరించారు.
రైతులు, కూలీలు, కార్మికులు, యువకుల సమస్యల పరిష్కారాలను విస్మరించారనీ, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమీషన్ (ఈసీ)ని దుర్వినియోగం చేస్తున్నారనీ, బీహార్‌లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తొలగించిన ఓట్లను కలిపారని గుర్తు చేశారు. బీహార్‌లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఓడిస్తారనీ, అక్కడ బీజేపీ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమనీ, అందుకే మహాకూటమిలో ఉన్నామని వివరణ ఇచ్చారు.
రాఘవులు మాట్లాడుతూ మావోయిస్టులు కొందరు లొంగిపోయారనీ, మరికొందరు సాయుధ పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేల మంది పోలీసులు, విమానాలు, డ్రోన్లను దించి ఎన్‌కౌంటర్లు చేసిందనీ, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చర్యలన్నీ బీజేపీ ఫాసిస్టు పాలనలో భాగమేనన్నారు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం కోసమే ఆపరేషన్ కగార్‌ను చేపట్టారని విమర్శించారు. మావోయిస్టుల లొంగుబాటు ఒక భాగమైతే, రాజ్యహింస కూడా ఎంత క్రూరంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు.
మావోయిస్టుల సిద్ధాంతంతో తాము ఏకీభవించబోమన్నారు. దేశంలో బీజేపీ ప్రమాదకర శక్తిగా ఉందనీ, ఇండియా బ్లాక్‌లో చేరాలని కేసీఆర్‌ను కోరామని ఆయన గుర్తు చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో కాంగ్రెస్‌తో తమకు ఇబ్బందులున్నాయనీ, అయినా దేశ ప్రయోజనాల కోసం, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా బ్లాక్‌లో ఉన్నామని వివరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు.. ప్రజా పోరాటాలను ఆపేది లేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టీకరణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ కర్తవ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రైతుల ఆమోదం ఉంటేనే ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ చేపట్టాలనీ, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మార్కెట్ రేటుకు అదనంగా మూడు రెట్లు పరిహారం చెల్లించాలని కోరారు. ఈ విషయంలో తాము నిర్వాసితుల పక్షాన పోరాడతామన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌పార్టీ హామీ ఇచ్చిందనీ, నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో తాము నిరుద్యోగ జేఏసీ పోరాటానికి మద్దతు ఇస్తామన్నారు. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాలంటూ కేంద్ర మంత్రి కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. మిగులు జలాల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందో తేల్చకుండా, పొరుగు రాష్ట్రానికి సహకరించాలంటూ కోరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెంచేలా కేంద్ర చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని కేసీఆర్‌ను అడిగామనీ, ఇప్పటి వరకు వారు దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోలేదన్నారు.