ఆఘమేఘాల మీద ఆదేశాలు ఇచ్చిన రవాణాశాఖ కమిషనర్
ధ్రువీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
త్వరలో షోరూముల్లోనే వాహన రిజిస్ట్రేషన్లు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చెక్‌పోస్టులు రద్దు చేయాలని రెండునెలల క్రితమే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ఎందుకు అమల్లోకి రాలేదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి రవాణాశాఖ ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. తక్షణం వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అదేశించారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ కమిషనర్ కే సురేంద్రమోహన్ బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా అన్ని చెక్‌పోస్టుల్ని మూసేసి, తాళాలు సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్రువీకరించారు. రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్ని మూసేస్తున్నామని ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్‌పోస్టుల అవసరం తగ్గిపోయిందనీ, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే చెక్‌పోస్టులు రద్దు అయ్యాయని తెలిపారు. రద్దయిన చెక్‌పోస్టు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి అక్రమ రవాణా జరక్కుండా మోబైల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల సంఖ్యను పెంచుతామన్నారు.
రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీ ద్వారా రూ.577 కోట్ల పన్ను మినహాయింపులు ఇచ్చామన్నారు. దీనివల్ల ఈవీ అమ్మకాలు 0.03 శాతం నుంచి 1.13 శాతానికి పెరిగాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ సిటీలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10వేల ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాహన్ సారధి పాలసీని అమల్లోకి తెస్తున్నామనీ, ప్రస్తుతం డేటా బదిలీ జరుగుతున్నదని తెలిపారు. స్క్రాప్ పాలసీకి మంచి స్పందన వచ్చిందన్నారు. రవాణాశాఖ కార్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని, ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామనీ, డ్రైవింగ్ మంచి నైపుణ్యాలు పెంచుతూ, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వాహనం కొన్న వెంటనే షోరూముల్లోనే రిజిస్ట్రేషన్లు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామనీ, త్వరలో దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. దీనివల్ల వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావల్సిన అవసరం ఉండదని తెలిపారు.
టూరిజం వెహికల్స్ డబుల్ నెంబర్‌ప్లేట్స్‌తో నడుస్తున్నాయనీ, అందువల్ల హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్‌ను తప్పనిసరి చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, దీని అమలుపై మెడికల్, పోలీస్, నేషనల్ హైవేస్‌తో సమీక్షా సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఓవర్‌లోడింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామనీ, ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు ఇదీ ఓ కారణమేనని వివరించారు. రాష్ట్రంలో ఏటా వాహనాల సంఖ్య పెరుగుతోందనీ, ప్రస్తుతం 1.70 కోట్ల వాహనాలు ఉన్నాయని చెప్పారు. రవాణాశాఖలోని 63 కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందనీ, బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఆర్టీసీ ఇతర ప్రభుత్వ విభాగాల్లో పాత వాహనాలకు స్క్రాప్‌కి పంపించాలని లేఖలు రాసామని తెలిపారు. సమావేశంలో రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ పాల్గొన్నారు.