Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంమధ్యప్రదేశ్‌లో దారుణం

మధ్యప్రదేశ్‌లో దారుణం

- Advertisement -

– దళితుడిపై దాడి.. మూత్రం తాగాలని బలవంతం
– ముగ్గురి అరెస్ట్‌.. నిందితులపై కేసులు నమోదు

భోపాల్‌ : బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకున్నది. ఓ దళిత యువకుడి(25)పై దాడి చేసిన కొందరు దుండగులు.. బాధితుడితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భిండ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధిత వ్యక్తి తన వద్ద డ్రైవర్‌గా పని చేయడం మానేసిన తర్వాత ప్రధాన నిందితుడు ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నాడని పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనీ, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వివరాళ్లోకెళ్తే… సోమవారం ముగ్గురు వ్యక్తులు బాధితుడిని గ్వాలియర్‌ నుంచి అపహరించారు. ఆ తర్వాత ఆయనను వాహనంలో భింద్‌కు తీసుకొచ్చారు. అక్కడ బాధితుడిని కొట్టి, ఆయనతో బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడు భిండ్‌లోని సుర్పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అకుత్‌పురా గ్రామ నివాసి. ”గ్వాలియర్‌లోని దీన్‌దయాళ్‌ నగర్‌ ప్రాంతం నుంచి నన్ను అపహరించారు. ఓ వాహనంలో భిండ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నన్ను ప్లాస్టిక్‌ పైపుతో కొట్టారు. ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని మధ్యలో ఆపి.. బాటిల్‌లో మూత్రం తాగాలని బలవంతం చేశారు” అని బాధితుడు ఆరోపించాడు. ఆ తర్వాత నిందితులు.. ఆ వ్యక్తిని అకుత్‌పురా గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఇనుప గొలుసుతో కట్టేసి బాధితుడి చేత మళ్లీ బలవంతంగా మూత్రం తాగించారు.

బాధితుడు.. దత్తావలి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు సోను బారువా దగ్గర డ్రైవర్‌గా పని చేశాడు. ఇటీవలే ఆయన వద్ద పనిని మానేశాడు. అయితే తన వద్ద డ్రైవర్‌గా పని చేయకపోవడంతో సోను బారువా.. బాధితుడిని లక్ష్యంగా చేసుకున్నాడు. కాగా బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స అందుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు. అరెస్టయిన ముగ్గురు నిందితులను సోను బారువా, అలోక్‌ వర్మ, చోటు ఓజాగా గుర్తించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయి. కట్ని జిల్లాలో అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న దళిత యువకుడిని నలుగురు వ్యక్తులు కొట్టి మూత్ర విసర్జన చేసిన కొన్ని రోజుల తర్వాతే ఈ ఘటన జరగటం గమనార్హం. బీజేపీ పాలనలో దళి తులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు చెందిన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులపై ఇలాంటి అమానుష ఘోరాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -