నవంబర్ 1 నాటికి ఇవ్వకుంటే 3 నుంచి విద్యాసంస్థల బంద్
ఉప ముఖ్యమంత్రి భట్టికి ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అల్టిమేటం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫాతి) ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. నవంబర్ ఒకటి నాటికి విడుదల చేయకుంటే మూడు నుంచి విద్యాసంస్థల బంద్ చేపడతామని అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను బుధవారం హైదరాబాద్‌లో ఫాతి చైర్మెన్ నిమ్మటూరి రమేష్‌బాబు, సెక్రెటరీ జనరల్ రవికుమార్, కోశాధికారి కొడాలి కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె సునీల్‌కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ప్రయివేటు కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్లుంటే రూ.300 కోట్లు విడుదల చేశారనీ, మిగిలిన రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మొత్తం రూ.పది వేల కోట్ల వరకు ఉన్నాయని వివరించారు. దసరా నాటికి రూ.600 కోట్లు, దీపావళి నాటికి రూ.600 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆ ప్రకారం విడుదల చేయలేదని తెలిపారు. దీంతో కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక, కాలేజీలను నపడలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కాలేజీలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.