జిల్లా వ్యాప్తంగా రూ.3 కోట్ల పైగా బకాయిలు.?
అచ్చంపేట డివిజన్ లో రూ.88 లక్షలు 45వేలు
నవతెలంగాణ – అచ్చంపేట
జిల్లాలో 20 మండలాలు 464 గ్రామపంచాయతీలు పరిధిలో కొన్ని వందల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన సర్వీస్ మీటర్ల విద్యుత్తు బకాయలు రూ. 3 కోట్ల పైగా ఉన్నట్లు అంచనా. ఒక అచ్చంపేట డివిజన్ పరిధిలోనే రూ.88 లక్షల, 45 వేల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు వేదికలు, ప్రభుత్వ ఆసుపత్రులు, అగ్రికల్చర్ మార్కెట్ లు, మండల పరిషత్, తాసిల్దార్, ఆర్డిఓ, ఎస్ టి ఓ ఆఫీసులు, ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాలు, ఎక్సైజ్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ భవనాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్టీసీ బస్టాండ్, డిపోలు, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలు, ఇలా వందల ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ బకాయిలు దాదాపు జిల్లాలో రూ.3 కోట్ల పైగా ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారులు ఎప్పుడూ కరెంటు నిలుపుదల చేస్తారని వివిధ శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి మండల పరిషత్ ఆఫీసులలో నిరంతరం కరెంటు అవసరం ఉంటుంది. బిల్లులు బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఎప్పుడూ కనెక్షన్ కట్ చేస్తారని మండల పరిషత్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈదురు గాలులకు ప్రభుత్వ కార్యాలయంలో కరెంటు వైర్లు తెగిపోవడం జరుగుతుంది, కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు కరెంటు అధికారులకు సిబ్బందికి ఫోన్లు చేస్తే… బకాయలు చెల్లించండి వచ్చి రిపేర్లు చేస్తాం కరెంటు సరఫరా చేస్తామని చెప్తున్నట్లు కొన్ని శాఖల అధికారులు తెలుపుతున్నారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, ప్రజలు రెండు, మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ అధికారులు ఇంటికి వచ్చి కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరిస్తూ.. బలవంతంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే మీటర్ కనెక్షన్లు తొలగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాలు కోట్ల రూపాయలు నెలల తరబడి బకాయిలు చెల్లించకపోతే సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు, ప్రైవేట్ సంస్థల యజమానులు విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలో ఉప్పునుంతల మండలంలో ప్రభుత్వ కార్యాల కరెంటు సర్వీసులు 25 ఉన్నాయి. ఈనెల 21 వరకు 6 లక్షల 47 వేల 156 రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదే విధంగా పదర మండలంలో 17 కనెక్షన్లకు రూ.2 లక్షల74 వేల 693, అచ్చంపేట మండలంలో 146 సర్వీస్ లకు సంబంధించి రూ.37లక్షల,80 వేల 341,బల్మూరు మండలంలో 37 సర్వీసులకు గాను రూ.5.లక్షల 27వేల 469, లింగాల మండలంలో 29 ప్రభుత్వ సర్వీసులకు గాను రూ.9 లక్షల 31వేలు, అమ్రాబాద్ మండలంలో 79 సర్వీస్ లకు గాను రూ 26 లక్షల,84 వేల 520 /- ఇలా అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 333 ప్రభుత్వ కరెంటు సర్వీసులు( మీటర్లు)లకు సంబంధించి రూ.88లక్షల 45 వేల 214 రూపాయలు బకాయిలు ఉన్నాయి.
ప్రైవేటు సంస్థల నుంచి ప్రజల నుంచి ఏ విధంగా కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలనుంచి విద్యుత్ శాఖ అధికారులు బకాయిలు వసూలు చేయాలని ప్రజలు, ప్రైవేటు సంస్థల యజమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిల్ తో పాటు నోటీసులు ఇస్తున్నాం: ఆంజనేయులు విద్యుత్ ఏఈ అచ్చంపేట
ప్రభుత్వ కార్యాలయాల బకాయిలకు కరెంట్ బిల్లు తోపాటు నోటీసులు ఇస్తున్నాం. బిల్లులు వసూలు చేయాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాం.
