Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంస్టాక్‌ ఎక్స్ఛేంజీలో తెలంగాణ భూములుకుదవపెడుతున్న సీఎం

స్టాక్‌ ఎక్స్ఛేంజీలో తెలంగాణ భూములుకుదవపెడుతున్న సీఎం

- Advertisement -

– 1.75 లక్షల ఎకరాల టీజీఐఐసీ భూముల తాకట్టుకు కుట్ర
– రూ.1.8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రూ.లక్ష కోట్లు కాంట్రాక్టర్లకిచ్చిన ప్రభుత్వం
– వారి నుంచి 20 శాతం కమీషన్‌ తీసుకున్న ముఖ్యమంత్రి
– రేవంత్‌ సొంత ఖజానాకు దాదాపు రూ.20 వేల కోట్లు : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ భూములను సీఎం రేవంత్‌రెడ్డి స్టాక్‌ ఎక్స్చేంజీలో కుదవ బెట్టి, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లక్షా 75 వేల ఎకరాల టీజీఐఐసీ భూములను స్టాక్‌ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ అయిన టీజీఐఐసీని ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారుస్తూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందని ఆరోపించారు. టీజీఐఐసీ హౌదాను మార్చడం ద్వారా రూ.వేల కోట్ల అదనపు రుణాలు సేకరించాలన్నదే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ఎజెండాగా ఉందన్నారు. రహస్యంగా జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంపదను స్టాక్‌ ఎక్స్ఛేంజీలో తాకట్టు పెట్టాల్సిన అవసనరం ఏమొచ్చిందని నిలదీశారు. అక్కడ నష్టం జరిగితే తెలంగాణ భూముల భవితవ్యం ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా తీసుకున్న టీజీఐఐసీని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్‌ చేశారు.
రేవంత్‌కు రూ.20 వేల కోట్ల కమీషన్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల పాలనలో రేవంత్‌ రెడ్డి సర్కారు రూ.1.80 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిందని కవిత గుర్తుచేశారు. ఈ అప్పులతో ఏ ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదనీ, హామీ ఇచ్చిన కొత్త పథకాలను ప్రారంభించలేదనీ, అభివృద్ధి పనులకూ వెచ్చించలేదని ఆమె విమర్శించారు. అయితే తెచ్చిన అప్పులో గతంలో చేసిన అప్పులకు చెల్లించింది రూ.80 వేల కోట్లు కాగా మిగతా రూ.లక్ష కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నుంచి 20 శాతం కమీషన్‌ రూపంలో రూ.20 వేల కోట్లను రేవంత్‌ రెడ్డి తన సొంత ఖజానాకు చేర్చుకున్నారని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. తాను చెప్పేది అబద్ధమైతే, అప్పులు, రుణాల తిరిగి చెల్లింపులు, ప్రభుత్వ వ్యయాలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె సవాల్‌ విసిరారు. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రికి చెందిన సొంత కాంట్రాక్టు సంస్థకు, మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి బిల్లులు చెల్లించడం మినహా రేవంత్‌ రెడ్డి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఆమె కొట్టిపారేశారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారనీ, పెద్ద ఎత్తున చెట్లను నరికేసి ప్రకృతిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను రేవంత్‌ రెడ్డి దెబ్బతీశారని ఆమె మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -