Friday, October 24, 2025
E-PAPER
Homeకరీంనగర్విద్యార్థులకు పౌష్టికాహారం అందించే చేతులకు ఆకలి బాధ

విద్యార్థులకు పౌష్టికాహారం అందించే చేతులకు ఆకలి బాధ

- Advertisement -

జీతాలు లేక కార్మికులకు అప్పులు
-నాణ్యత లేని బియ్యంతో తిప్పలు
-అర్దాకలితోనే విద్యార్థుల చదువులు
రాయికల్-నవతెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం వంటలు చేసే కార్మికులు పిల్లల కడుపులు నిండేలా శ్రమిస్తున్న ఈ మహిళల కడుపులు మాత్రం జీతాల లేమితో ఖాళీగా ఉన్నారు. మండల వ్యాప్తంగా 105 మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి 2025 జూన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే 2000 రూపాయల గౌరవ వేతనంతో పాటు గత రెండు నెలలుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించే 1000 రూపాయల గౌరవ వేతనాలు అందకపోవడంతో పాటుగా గత మూడు నెలలుగా వంట సామాగ్రికి అందించే రుసుము,గత 11 నెలలుగా కోడి గుడ్లకు చెల్లించే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.

సర్కారు బడుల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోషన్ అభియాన్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది.మండలంలో 53 ప్రభుత్వ పాఠశాలల్లో 3807 మంది విద్యార్థులు భోజనాన్ని తింటున్నారు.కాగా మండలంలోని పాఠశాలలకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేయకుండా సమీప గ్రామాల్లోని రేషన్ డీలర్ల వద్ద అన్లోడ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు.దీనితో నిర్వాకులు అదనంగా ఆటో చార్జీలు చెల్లించి బియ్యాన్ని పాఠశాలకు తరలించుకునే పరిస్థితులు నెలకొన్నాయి.కాగా కొన్ని పాఠశాలల్లో గత కొన్ని రోజులుగా నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో అన్నం తయారు చేసే సమయంలో బియ్యం ఉడికి ఉడకనట్లుగా,బంకగా,ముద్దగా తయారు అవడం వల్ల విద్యార్థులు సరిగా తినకుండా కాలి కడుపుతోనే పాఠాలు వినే పరిస్థితి నెలకొందని నిర్వాహకులు,విద్యార్థులు వాపోతున్నారు.

-పిల్లలకు భోజనం,వారికి బాకీలు
మిడ్ డే మీల్స్ నిధులు ఆలస్యంగా రావడం వల్ల కార్మికుల జీతాలు నెలల తరబడి నిలిచిపోతున్నాయి. పాఠశాలల్లో భోజనం మాత్రం సమయానికి అందించాలనే అంకితభావంతో వారు వంట చేస్తున్నారు.అయితే వేతనాలు అందకపోవడంతో అప్పులు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.

మధ్యాహ్న భోజనకార్మికులు నిజంగా ఎంతో కష్టపడుతున్నారు. వేతనాలు ఆలస్యం కావడం దురదృష్టకరం.పిల్లలకు భోజనం సమయానికి అందించడంలో వారు ప్రధాన బలం.వారు సంతోషంగా ఉంటేనే పిల్లల భోజనం నాణ్యతగా ఉంటుందని పలువురు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

-నాణ్యత లేని బియ్యంతో తిప్పలు: దొంతుల లక్ష్మి,మధ్యాహ్నభోజన నిర్వాహకురాలు (జెడ్పిహెచ్ఎస్-రామాజీపేట్)

మేము పిల్లల కోసం ప్రేమతో వంట చేస్తాం.వాళ్లు తింటే మనసుకు సంతోషం.కానీ నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేయడంతో పిల్లలు సరిగా తినకపోవడంతో చాలబాధగా ఉంటుంది.దీనికి తోడు మూడు నెలల జీతాలు అందక మేము పస్తులుండే పరిస్థితి ఏర్పడుతుంది.అధికారులు తనిఖీ చేసినాకే బియ్యాన్ని పాఠశాలలకు పంపిణి చేయాలి.నిర్వహణ ఖర్చులు వెంటనే చెల్లించాలి.

అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం -మందుల లావణ్య మధ్యాహ్నభోజన నిర్వాహకురాలు (జెడ్పిహెచ్ఎస్-భూపతిపూర్)

250 మంది విద్యార్థులకు రోజు కిరాణా సామాగ్రి,వారానికి మూడుసార్లు కోడుగుడ్లు తీసుకురావాల్సి ఉంటుంది.మెనూ ప్రకారం రెండు కూరలు వంట చేయాలి.11 నెలలుగా కోడి గుడ్ల డబ్బులు రాలేదు.8 తరగతి వరకు కూడా 4 నెలల నిర్వహణ ఖర్చులు అందక అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలి.

అన్నం సరిగా తినలేకపోతున్నాం -ఏనుగంటి వర్షిణి,10వ తరగతి విద్యార్థిని-రామాజీపేట్
గత కొన్ని రోజులుగా అన్నం బంకగా,ముద్దలు ముద్దలుగా అవడంతో తినలేక పోతున్నాం.పాఠాలు వినేపుడు ఆకలిగా ఉండటంతో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నాం.అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలనీ కోరుతున్నాం.

ప్రభుత్వం దృష్టి సారించాలి -సులోచన,సిఐటియు-జిల్లా కో కన్వీనర్,మధ్యాహ్నభోజన కార్మికుల రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
పిల్లలకు పుష్టికర భోజనం అందించే ఈ మహిళల కృషిని గుర్తించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాగ్రి,కోడి గుడ్ల ఖర్చులు, వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.నవంబర్ 2024 నుండి పిబ్రవరి 2025 వరకు అందించే బిల్లులు తిరస్కరించడం సరికాదు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బకాయి బిల్లులు,గౌరవ వేతనాలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -