ప్రచారానికే మహిళా బిల్లు : కూనంనేని

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపజేసుకున్నామంటూ ప్రచారం చేసుకోవడానికే తప్ప, దాని అమలుకు మరో రెండు ఎన్నికల వరకు ఆగాల్సి వస్తుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజంగా మోడీ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదేండ్ల క్రితమే ఆమోదింపజేసేదని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రస్తుత బిల్లును పరిశీలిస్తే మరో ఆరేండ్ల వరకు అమలు కాని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. చట్ట సభలలో ఉన్న సీట్లలోనే మూడో వంతు రిజర్వేషన్‌ అమలు చేస్తారే తప్ప, అదనంగా స్థానాలు పెంచే విధంగా బిల్లులో పొందుపర్చలేదనపి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, కొత్తగా జనాభా లెక్కల అవసరం లేకుండానే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ అమలయ్యేలా బిల్లులో మార్పు చేయాలని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును స్వాగతించడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఘనత సీపీఐ సీనియర్‌ పార్లమెంటేరియన్‌ గీతా ముఖర్జీదేనని స్పష్టం చేశారు.
అమలుకు అడ్డంకులేంటీ?
మహిళా రిజర్వేషన్‌ బిల్లు తక్షణమే అమలు చేయకుండా మోడీ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేంటని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్‌రాజా ప్రశ్నించారు.

Spread the love