Friday, October 24, 2025
E-PAPER
Homeమానవిఔషధాల గని

ఔషధాల గని

- Advertisement -

ఆరోగ్యానికి మేలు చేసే కాయగూరల్లో మునగది ప్రత్యేక స్థానం. మునగాకు, పువ్వు, కాయ వేటికవే ఔషధ గుణాలు కలిగిఉన్నాయి. రోజువారీ ఆహారంలో మునగని చేర్చుకుంటే ఎంతో మేలు. అయితే రోజుకు ఎంత మోతాదులో తినాలి అనేదానిపై చాలామందికి స్పష్టత లేదు. అలాగే సాధారణానికి భిన్నంగా మునగలో నిక్షిప్తమైన ఔషధగుణాలపై కూడా అవగాహన ఉండదు. మునగాకుని సలాడ్‌లు, ఆమ్లెట్లు, అల్పాహార వంటకాల్లో కలిపి తినవచ్చు. తృణధాన్యాల పిండిలో ఈ పొడిని కలుపుకుని వంటకాలు చేసుకోవడం వల్ల సూక్ష్మ పోషకాల లోపాన్ని అధిగమించవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులతో పోరాడే గుణం మునగలో ఉందని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

ఔషధాల్లో మేటి
కీమోథెరపీ మందుల్లో కనిపించే అపిజెనిన్‌ మునగాకుల్లో కనిపిస్తుంది. క్యాన్సర్‌ నిరోధక మందుల్లో కనిపించే అల్లోస్‌, ఐసోథియోసైనేట్‌, ఆస్ట్రాగలిన్‌, ఐసోక్వెర్సెటివ్‌ భాగాలు కూడా ఇందులో ఉన్నాయి. రక్తంలో చక్కెరని తొలగించే ఎంఒఎల్‌పి1 ప్రొటీన్‌ కూడా మునగాకు నుండి లభిస్తుంది. మన దేశ సాంప్రదాయ వైద్యంలో 300కి పైగా వ్యాధులకు చికిత్స చేయడానికి మునగ చెట్టు వివిధ భాగాలను ఉపయోగిస్తారు. దేశీయ వైద్యంలో మునగ వేర్లతో ఉడికించిన నీటిని సేవించడం వల్ల విరేచనాలు, కంటి వ్యాధులు, గుండెజబ్బులు నయమవుతాయి. మునగ పువ్వుల్లో స్టిగ్మాస్టెరాల్‌, సిటోస్టెరాల్‌, ఫినాల్‌ వంటి ఫైటోస్టెరాల్స్‌ ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లుల్లో పాలను పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

పండ్లలో కంటే అధికంగా..
నారింజలో కంటే పది రెట్లు విటమిన్‌ సి, పదిరెట్లు అధిక ప్రొటీన్‌ మునగలో ఉంటుంది.
అరటిపండ్లలో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.
వంద గ్రాములు మునగ ఆకుల్లో 1000 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
ఎనిమిది ఔన్సుల పాలల్లో 300 నుండి 400 మిల్లీ గ్రాముల కాల్షియం మాత్రమే లభిస్తుంది.
ఐరన్‌ లోపంతో బాధపడే వారు మాత్రలు తీసుకోవడం కంటే ఆహారంలో మునగాకుని చేర్చుకోవడం ఎంతో ఉత్తమం.
వంద గ్రాముల బీఫ్‌లో రెండు మిల్లీగ్రాముల ఇనుము లభిస్తే అదే వంద గ్రాముల మునగాకులో 28 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. అలాగే అదే మోతాదుకి 2 నుండి 3 మిల్లీ గ్రాముల జింక్‌ లభిస్తుంది. రోజువారీ అవసరంలో ఇది పది శాతం.

రోజుకు ఎంత మునగ తినాలి?
ఎండిన మునగ ఆకుల పొడిని రోజుకు ఏడు గ్రాముల వరకు తీసుకోవడం సురక్షితమని, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులకు మందులు తీసుకునే వారు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించిన తర్వాతే మునగ ఆకుల పొడిని తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -