కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై వాన్స్
జెరుసలేం : కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గాజాలో ఇజ్రాయిల్ తన మారణహోమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అమెరికా నేతలకు అదేమీ కన్పించడం లేదు. తాము ఆశించిన దాని కంటే కాల్పుల విరమణ ఒప్పందం బాగానే అమలవుతోందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ప్రతినిధులు చెప్పుకొచ్చారు. జెరుసలేంలోని ప్రధాని కార్యాలయంలో వారు బెంజిమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. పౌర, సైనిక సహకారం కోసం ఏర్పాటు చేసిన నూతన కేంద్రాన్ని సందర్శించారు. గత కొద్ది రోజులుగా హింస పెరుగుతున్న మాట నిజమేనని వాన్స్ అంగీకరించారు. కానీ ఈ నెల 10న మొదలైన కాల్పుల విరమణ తాను ఆశించిన దాని కంటే మెరుగ్గానే ఉన్నదని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘దీర్ఘకాలిక శాంతి ప్రణాళికపై ఇజ్రాయిల్‌లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. హమాస్ ఆయుధాలను విడనాడుతుందా, గాజాకు అంతర్జాతీయ భద్రతా బలగాలు ఎప్పుడు ఎలా వస్తాయి, యుద్ధం తర్వాత ఆ ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు వంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉంది’ అని విట్‌కాఫ్ తెలిపారు. కాల్పుల విరమణ పర్యవేక్షణకే తాను ఇజ్రాయిల్ వచ్చానన్న వాదనను వాన్స్ తోసిపుచ్చారు. కానీ శాంతి నెలకొనే స్థలంలోనే తాము ఉన్నామన్న విశ్వాసం కలిగిందని చెప్పారు. హమాస్ కనుక సహకరించని పక్షంలో దానిని తుడిచిపెడతామని హెచ్చరించారు. కాగా రెండు సంవత్సరాల పాటు సాగిన యుద్ధం నుంచి ఇరు పక్షాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని ట్రంప్ అల్లుడు అరెడ్ కుష్‌నర్ తెలిపారు.



