Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపరిశోధనలకు పెద్దపీట

పరిశోధనలకు పెద్దపీట

- Advertisement -

క్లోజ్డ్‌ క్యాంపస్‌ దిశగా ఓయూ అడుగులు
రెగ్యులర్‌ అండ్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు
న్యాక్‌ 4వ సైకిల్‌లో మెరుగైన గ్రేడ్‌కు నిరంతరం శ్రమ
ఆహార పదార్థాల వ్యర్ధాలతో బయోగ్యాస్‌ ఉత్పత్తి
అధునాతన టెక్నాలజీతో సెంటినరి కన్వెన్షన్‌ సెంటర్‌
పర్యావరణ పరిరక్షణకు ఓయూలో బ్యాటరీ బస్సులు
ఓయూ వీసీగా ఏడాది పూర్తి చేస్తుకున్న


ములాఖాత్‌
ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం

ఉస్మానియా యూనివర్సిటీని ప్రధానంగా క్లోజ్డ్‌ క్యాంపస్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్టు ఓయూ వీసీ ప్రొ.ఎం. కుమార్‌ మొలుగరం తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. సాధించిన అభివృద్ధి, విజయాలు, భవిష్యత్‌ లక్ష్యాలపై నవతెలంగాణ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భవిష్యత్తులో తన ముందున్న సవాళ్ళు, లక్ష్యాలను, ప్రణాళికలను వివరించారు. యూని వర్సిటీలో తాను వీసీగా బాధ్యతలు చేపట్టాక అకాడమీక్‌ క్లాస్‌ వర్క్‌ పూర్తిస్థాయిలో గాడిలో పడిందన్నారు. పరిశోధనలకు పెద్దపీట వేసినట్టు తెలిపారు.

పలు వసతిగృహాల్లో అవసరమైన మేరకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్‌ పనులు పూర్తి చేసి, వాటర్‌ ఫిల్టర్స్‌ ఏర్పాటు చేసి కట్టెల పొయ్యి స్థానంలో గ్యాస్‌ పోయ్యిలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే మెస్‌లలో గత అనుభావాలు దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఓయూలో వృధా అవుతున్న ఆహార పదార్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. దీనికి ‘సెక్యూలర్‌ ఎకనామీ’ అవార్డ్‌ కూడా యూనివర్సిటీని వరించిందని గుర్తు చేశారు.

క్యాంపస్‌ అభివృద్ధికి కృషి
యూనివర్సిటీ 78శాతం పచ్చదంతో నిండి ఉంది. ఆర్గనైజ్‌ చేసిన గ్రినరీ ప్రణాళికలతో క్యాంపస్‌ను తీర్చిదిద్దుతున్నాం. న్యాక్‌ 4వ, సైకిల్‌ అక్సిడిటేషన్‌ కార్యక్రమాల్లో 90 శాతం వర్క్‌ పూర్తిచేసి, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో సైటేషన్స్‌లో ముందుకు రావడం, హెచ్‌-ఇండెక్స్‌, పేటెంట్స్‌, పబ్లికేషన్స్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాం. ఫెయిర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లో రూ.15కోట్లు వచ్చాయి. ఇంజనీరింగ్‌ కళాశాలకు మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ద్వారా రూ.15 కోట్ల నిధులు విడుదల చేయడం ద్వారా ”స్వదేశీ చిప్స్‌” డిజైన్‌ ప్రాజెక్ట్‌ కొనసాగుతోంది.

పారదర్శకంగా పీహెచ్‌డీ అడ్మిషన్స్‌
పీహెచ్‌డీ అడ్మిషన్స్‌ 2025 ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశాం. సీఏఎస్‌ ప్రమోషన్స్‌లో కూడా జనవరి, జూలై 2025 నోటిఫికేషన్ల ఆధారంగా ఇంటర్వ్యూలు పూర్తి చేసి పారదర్శకంగా ఉద్యోగులకు ప్రమోషన్స్‌ ఇచ్చాం. 150 మంది బోధనేతర ఉద్యోగులయిన జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌, ల్యాబ్‌ అటెండెన్స్‌ పోస్టులు భర్తీ చేశాం. యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారిగా మహిళ ఉద్యోగినిని జేఆర్‌గా నియమించాం.

వసతుల కల్పన, పరిశోధన వికాసానికి కృషి
వసతుల అభివృద్ధి, పరిశోధన, శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల కోసం కాన్ఫరెన్స్‌లు, రీసెర్చ్‌ గ్రాంట్లు, ఫెలోషిప్‌లను రూ.5వేల చొప్పున 200 మందికి అందజేసే కార్యక్రమాన్ని ఇటీవల సీఎం చేతుల మీదుగా ప్రారంభించాం. స్టాండింగ్‌ కమిటీ ద్వారా నెలకు ఒకసారి ప్రిన్సిపాల్స్‌ సమావేశాలు ఏర్పాటు చేసి, అకాడమిక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రీసెర్చ్‌ ప్రాజెక్టులు సమగ్రంగా అమలు అయ్యేలా చేస్తున్నాం. పీజీ కోర్సుల క్రెడిట్స్‌ను 80 నుంచి 96 వరకు పెంచాం.

తీరనున్న వసతిగృహాల లోటు
ఇటీవలే దుందుభి, భీమా వసతి గృహాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించాం. ట్రైబల్‌ వెల్ఫేర్‌ సహకారంతో కొత్తగా గర్ల్స్‌, బార్సు వసతి గృహాలను రూ.10 కోట్లతో నిర్మించనున్నాం.

కార్పొరేట్‌ వర్సిటీలకు దీటుగా ఓయూ విద్యార్థులకు వేతనాలు
ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 40 లక్షల ప్యాకేజీ, ఎంబీఏ కళాశాలలో రూ.16 లక్షల ప్యాకేజీతో ఓయూ విద్యార్థులు కార్పొరేట్‌ వర్సిటీలకు దీటుగా మంచి వేతనాలు పొందుతున్నారు. ‘ఔట్‌ కం బేస్డ్‌ ఎడ్యుకేషన్‌’పై నిపుణుల ద్వారా మూడు రోజుల వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి 1200 మంది ఫ్యాకల్టీకి శిక్షణ ఇప్పించాం. 84వ స్నాతకోత్సవాన్ని ఆగస్టులో నిర్వహించి 1261 పీహెచ్‌డీలు, 121 బంగారు పతకాలను అందజేశాం. ఇస్రో చైర్మెన్‌ వి.నారాయణ్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాం.

గ్రీన్‌ క్యాంపస్‌ కోసం బ్యాటరీ బస్సులు
వర్సిటీ గ్రీన్‌ క్యాంపస్‌ కోసం బ్యాటరీ బస్సులు, ఈ రిక్షాలు, సోలార్‌ ఫ్యానల్స్‌ ఏర్పాటు, విద్యుత్‌, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపడుతున్నాం. సీఎస్‌ఐఆర్‌ ద్వారా రెండు బస్సులు నవంబర్‌లో ఓయుకు వస్తాయి. విద్యార్థులు, ఫ్యాకల్టీ, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోనున్నాం.

అధునాతన టెక్నాలజీతో సెంటినరి కన్వెన్షన్‌ సెంటర్‌
ఓయూ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో సెంటినరి కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నాం. ఈ సెంటర్‌లో 2,500 మంది సామర్థ్యం కలిగిన ప్రధాన హాల్‌, 500 మంది సామర్థ్యం కలిగిన ఒక హాల్‌, 100-300 మంది సామర్థ్యం కలిగిన రెండు హాల్స్‌, 20 ప్లేస్‌మెంట్‌ క్యాబిన్స్‌, రెండు వేల మందికి ఒకేసారి భోజనం చేసే డైనింగ్‌ హాల్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీనిని ఓయూలో ఐకానిక్‌ బిల్డింగ్‌గా తయారుచేయడానికి భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయనున్నాం.

రిక్రూట్‌మెంట్‌ విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వ సహకారంతో రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీని ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రధానంగా క్లోజ్డ్‌ క్యాంపస్‌ అభివృద్ధికి ప్రత్యేక ఫోకస్‌ పెట్టి, వర్సిటీలోని పలు ఖాళీ క్యాంపస్‌లను వేరే ప్రదేశాల్లోని నివాసాలకు మార్చే ప్రయత్నాలు చేస్తాం. అలాగే భవనాల సంరక్షణ కోసం డిజిటల్‌ మ్యాప్‌ను ఏర్పాటు చేసి, భవనాలు, వర్సిటీ భూముల పర్యవేక్షణను పటిష్టంగా నిర్వహిస్తాం. అంతర్గత రోడ్లు నిర్మించడం, స్ట్రీట్‌ లైట్ల ఏర్పాటు వంటి పనులు కూడా కొనసాగుతున్నాయి.

ముందున్న లక్ష్యాలు
రూ.1000 కోట్లకు ‘డిపీఆర్‌ఓ’ ప్రిపరేషన్‌ చేస్తున్నాం. డిసెంబర్‌ 9న ఓయూలో సీఎం ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నాం. మెరుగైన ర్యాంకింగ్‌ కోసం కృషి చేస్తూ ప్రధానంగా ”న్యాక్‌” 4వ సైకిల్‌ అక్రిడిటేషన్‌ వెళ్లడం.. మెరుగైన ర్యాంకు సాధన కోసం ముమ్మరంగా కృషి చేస్తున్నాం. క్యూఎస్‌, వరల్డ్‌ ర్యాంకింగ్‌లో మెరుగైన ర్యాంకింగ్‌ పొందడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాం. గత 4 ఏండ్లుగా వివిధ అడ్మిషన్లలో 65 శాతం గర్ల్స్‌ రాకతో ఒక మెగా హాస్టల్‌ను 1200 మంది సామర్థ్యంతో, రూమ్‌కు నలుగురు చొప్పున ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే 1000 మంది అబ్బాయిలు ఉండేందుకు మరొక మెగా హస్టల్‌ నిర్మాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -