Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రూ. 2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

- Advertisement -

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
హైదరాబాద్‌ బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సుమారు రూ. 2.22 కోట్ల విలువైన దాదాపు 900 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఎస్‌. చైతన్య కుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బండ్లగూడ మెయిన్‌రోడ్‌లోని ఓఎస్‌ ఫంక్షన్‌ హాల్‌ ముందు నిలుచున్న ఆచార్‌ డీసీఎం వాహనంలో మాదకద్రవ్యాలున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఈస్ట్‌ సౌత్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, బండ్లగూడ పోలీసులు కలిసి వెంటనే అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. వాహనంలో గంజాయి పట్టుబడటంతో లారీ డ్రైవర్‌ మహమ్మద్‌ ఖలీముద్దీన్‌ అలియాస్‌ ఫరీదుద్దీన్‌, షేక్‌ సోహెల్‌, మహమ్మద్‌ అఫ్జల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి ఒడిశాలోని మల్కాజిగిరి అలీముల్లా గ్రామం నుంచి మహారాష్ట్ర నాసిక్‌ వైపు తీసుకువెళ్తున్నట్టు విచారణలో వెల్లడైంది.

రెహమాన్‌ అనే వ్యక్తి ద్వారా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. అతని స్నేహితులు ఒడిశా నివాసి జిత్తు, ఆంధ్రప్రదేశ్‌ నివాసి సురేశ్‌ కలిసి ఈ వ్యాపారంలో ఉన్నారని చెప్పారు. వీరు గత మూడు నెలలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తూ ఒక్కొక్కరు రూ.3లక్షల నుంచి 4 లక్షల సంపాదిస్తున్నారని, ఒకేసారి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడం ద్వారా అధిక లాభం పొందడానికి ప్రయత్నించారని తెలిపారు. రెహమాన్‌ పరారీలో ఉన్నందున త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. పట్టుకున్న వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ఐచర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ (టీఎస్‌12 యూడీ 9327), రూ. 2,500 నగదు జప్తు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ ఆది శ్రీనివాస్‌ రావు, ఏసీపీ ఏ. సుధాకర్‌ చంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌. సైదాబాబు, సీఐ. ఆర్‌. దేవేందర్‌, ఎస్‌ఐలు కె. రామారావు, ఎం. మధు, డీ. సుభాష్‌, కానిస్టేబుళ్లు గులాం చాంద్‌ పాషా, కె. కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -