కాల్పుల కేసును 12గంటల్లో ఛేదించిన రాచకొండ పోలీసులు
యువకుని ప్రాణాలు కాపాడిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు
వదంతులు నమ్మొద్దు
చట్టానికి ఎవరూ అతీతులు కారు : రాచకొండ సీపీ జీ.సుధీర్‌బాబు
నవతెలంగాణ- సిటీబ్యూరో, హయత్ నగర్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పోచారం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు 12గంటల్లో ఛేదించారు. సమాచారం అందిన వెంటనే పోచారం ఐటీ కారిడార్ పోలీసులు స్పందించడం, సకాలంలో గాయపడిన యువకుడ్ని ఆస్పత్రిలో చేర్పించడంతో బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వ్యక్తిగత లాభాల కోసమే పోచారంలో కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని 12గంటల్లో పట్టుకున్నామని రాచకొండ సీపీ జీ.సుధీర్‌బాబు తెలిపారు. గురువారం హైదారబాద్ ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను సీపీ వెల్లడించారు. బండ్లగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం ఖురేషి గత 12ఏండ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పశువులను రావాణా వ్యాపారం చేస్తున్నాడు.
షాబాద్‌కు చెందిన కుర్వ శ్రీనివాస్, పశువులను రవాణా చేసే కాలాపత్తర్‌కు చెందిన హస్సాన్‌బిన్ మోసిన్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ హనిఫ్ ఖురేషీ స్నేహితులు. కీసర మండలం, రాంపల్లికి చెందిన ప్రశాంత్ కుమార్ అలియాస్ సోను సింగ్.. ఇతను గో సంరక్షణ కార్యకర్త. ఎక్కడైనా ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్టు కనిపిస్తే తోటి గో సంరక్షణ కార్యకర్తలకు సమాచారం చేరవేస్తాడు. కాగా, పలుమార్లు తన ఆవులను కళేభరాలకు వెళ్లకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి తన వ్యాపారానికి అడ్డు వస్తుండటంతో ఇబ్రహీం ఖురేషి దాదాపు కోటి రూపాయాల వరకు నష్టపోయాడు. అలాగే ఇబ్రహీంపై ఈ ఏడాది ములుగు, గజ్వేల్, శంషాబాద్ రూరల్, ఘట్‌కేసర్ తదితర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2024లో శంషాబాద్ రూరల్, 2022లో కమాటిపురాలో ఆక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలనూ పోలీసులు సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో సోనుసింగ్, ఇబ్రహీం రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడు కున్నారు. ఎలాగైనా సోనుసింగ్ అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇబ్రహీం.. చత్తీస్‌గఢ్‌లోని తన స్నేహితుని నుంచి కంట్రీమేడ్ తుపాకీని కొనుగోలు చేసి ఆరాంఘర్‌కు చెందిన ఓ డ్రైవర్‌తో తెప్పించుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడైన శ్రీనివాస్‌కు సోనుసింగ్‌తో ఉన్న పరిచయంతో ఇబ్రహీంకు సంబంధించిన మ్యాటర్ సెటిల్ చేద్దామని బుధవారం శ్రీనివాస్ సోనుసింగ్‌తో చెప్పి శంషాబాద్ రావాలని సూచించాడు. అందుకు నిరాకరించిన సోనుసింగ్ తాను చెప్పిన విధంగా ఘట్‌కేసర్‌వైపు రావాలని చెప్పాడు. దాంతో సాయంత్రం 5గంటల సమయంలో రెట్రోహౌటల్ వద్ద కలుసుకున్నారు. ఇబ్రహీం, హనీఫ్ ఖురేషి, హస్సాన్, శ్రీనివాస్, సోనుసింగ్ దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హౌటల్ సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలోని వెంచర్‌లోకి వెళ్లారు.
ఈ మాటల సందర్భంగా కోటిరూపాయల నష్టం జరిగిందంటూ ఇబ్రహీం ప్రస్తావించడం, రూ.5లక్షలు కావాలని సోనూసింగ్ డిమాండ్ చేయడంతో ఇరువురిమధ్య మాటా మాట పెరిగింది. ఈ క్రమంలో సోనూ సింగ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపిన ఇబ్రహీం అక్కడి నుండి పరారయ్యాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక తుపాకీ, రెండురౌండ్ల బులెట్లు, ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నట్టు సీపీ వెల్లడించారు. సోను ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేరం చేసినవారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని, చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, వదంతులను నమ్మొద్దని సీపీ కోరారు. ఈ సమావేశంలో డీసీపీ పద్మాజారెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ చక్రపాణి, ఏసీపీ రమేష్‌తోపాటు పోచారం, ఉప్పల్, మాల్కాజ్‌గిరి, కుషాయీగూడ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.



