Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభద్రాచలం- వెంకటాపురం మధ్యరోడ్డు నిర్మాణం చేపట్టండి

భద్రాచలం- వెంకటాపురం మధ్యరోడ్డు నిర్మాణం చేపట్టండి

- Advertisement -

మంత్రి కోమటిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, ముగుగు జిల్లా వెంకటాపురం వరకు సుమారు 120 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గురువారం హైదరాబాద్‌లో జూలకంటి రంగారెడ్డితోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి క్రిష్ణారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ఉన్న ప్రధాన రహదారి తీవ్రమైన గుంతలమయం అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరికి ఇరువైపుల ఇసుక లారీలు అంచనాలకు మించి ఇసుక రవాణా చేయడం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు. ప్రజారవాణాకు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. పెద్దపెద్ద గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనేక మరణాలు కూడా సంభవించాయని వివరించారు. ఇలాంటి పరిస్థితి భద్రాచలం నియోజకవర్గంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.

రోడ్డు ధ్వంసం అయిపోయి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు ఆస్పత్రులకు వెళ్లాలన్నా రైతులు వ్యవసాయ అవసరాల కోసం పంట పొలాలకు వెళ్లాలన్నా ఈ రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. అలాంటి రోడ్డు గుంతలమయమై మోటార్‌ సైకిల్‌ వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గ కేంద్రానికి పోవాలన్నా ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. భద్రాచలం నుంచి ఆర్టీసీ బస్సులు వెంకటాపురం రావాలన్నా రోడ్డు పూర్తిగా గుంతలమయం అవ్వడంతో నాలుగు నెలలుగా బస్సులు కూడా నడపడం లేదని వివరించారు. రోడ్డు నిర్మాణానికి నిధులను కేటాయించాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రెండు నెలలుగా ఆందోళనలు, పోరాటాలు నిర్వహించామని తెలిపారు. పాదయాత్ర చేపట్టామనీ, బంద్‌ చేశామని గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా స్థాయి అధికారులకు అనేక సార్లు విన్నవించామని పేర్కొన్నారు. అయినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఆ రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేసేందుకు కృషి చేయాలని మంత్రిని వారు కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన మరమ్మత్తులను వెంటనే చేపడతామంటూ హామీ ఇచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -