Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేలకొరిగిన వరిచేలు

నేలకొరిగిన వరిచేలు

- Advertisement -

మిర్యాలగూడ మండలం ఐలాపురంలో 450 ఎకరాల్లో పంట నష్టం
ఆదుకోవాలని రైతుల వేడుకోలు
క్షేత్రస్థాయి పరిశీలనలో వ్యవసాయాధికారులు

నవతెలంగాణ-మిర్యాలగూడ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న అకాల వర్షాలతో వరిచేలు నేలకొరిగాయి. దాంతో అన్నదాతలకు తీరని నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగర్‌ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వరిచేలు నేలకొరిగాయి. మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం గ్రామ శివారులో ఉన్న సుమారు 450 ఎకరాల్లో వరిచేలు నేలకొరిగాయి. పాలు పోసుకొని, గింజ పోసుకునే దశలో అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయి.

మరో నెల రోజుల్లో పంట కోసే అవకాశం ఉండటం ఈ లోపే అకాల వర్షాలు పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, త్రిపురారం, నిడమానూరు, అనుముల, తిరుమలగిరి సాగర్‌ మండలాల్లోనూ వరిచేలు దెబ్బతిన్నాయి. రైతులు ఒక్కొక్క ఎకరానికి రూ. 25వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు అన్నదాతలకు నట్టేట ముంచాయి. మరికొన్ని చోట్ల వరి కంకులకు ఉన్న గింజలు రాలిపోయాయి.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు
నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఏయే గ్రామాల్లో పంట ఎంత నేలకొరిగింది అనే విషయాలను రైతుల ద్వారా తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాలలో నష్టపోయిందో రికార్డులో నమోదు చేసుకుంటున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం : సైదా నాయక్‌, ఇన్‌చార్జి ఏడీఏ, మిర్యాలగూడ
అకాల వర్షాలు కారణంగా వరి పైరులు నేలకొరిగిన విషయం రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారు. వెంటనే గ్రామస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం. పాలు పోసుకునే దశలో వరి పొలాలు నెలకొరిగితే అంతగా నష్టం ఉండదు. గింజ పోసుకున్న దశలో మాత్రమే పొలాలు నేలకొరిగితే నష్టం జరుగుతుంది. అలాంటి విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. వచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.

ప్రభుత్వం ఆదుకోవాలి
ఐలాపురం శివారులో ఒక ఎకరం వ్యవసాయ పొలం ఉంది. దాని పైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పటికీ రూ.30 వేల ఖర్చుపెట్టి సన్న వరి రకం ధాన్యాన్ని సాగు చేశాను. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పంటంతా నేలకొరిగింది. ఇప్పుడే గింజ పోసుకుని పంట చేతికి వచ్చింది. మరో నెల రోజుల్లో గింజ పడితే కోతలు చేయాలి. దీనివల్ల తనకు తీవ్ర నష్టం కలిగింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
పద్మ, మహిళా రైతు, మిర్యాలగూడ

లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టా
నాకున్న మూడెకరాల వ్యవసాయ పొలంలో సన్న రకం ధాన్యాన్ని సాగు చేశా. ప్రస్తుతం వరి చేను పాలు పోసుకొని గింజ పోసుకునే దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది.
తేజవత్‌ రుప్లా, ఐలాపురం, మిర్యాలగూడ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -