నియోజకవర్గ చరిత్రలో ఇంత మంది పోటీ చేయడం ఇదే తొలిసారి
మొత్తం 4,01,365 మంది ఓటర్లు
తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల అధికారి
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. మొత్తం 211 మంది అభ్యర్థు లు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 81 ఆమోదం పొందాయి. అనంతరం 23 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉప సంహరించుకో వడంతో చివరికి 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులూ ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇంత మంది పోటీ చేయడం ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది, 2023లో 19 మంది పోటీ పడ్డారు.
తుది ఓటర్ల జాబితా విడుదల
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి. కర్ణన్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత 2,383 మంది కొత్త ఓటర్లు చేరారని వివరించారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.2.84 కోట్లు, రూ.3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 139 లోకేషన్లలో 407 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
గత ఎన్నికలతో పోల్చితే నియోజకవర్గంలో ఈసారి 1.61 శాతం ఓటర్లు పెరిగారని చెప్పారు. అదేవిధంగా, 80 ఏండ్లకు పైబడిన ఓటర్లు 6,052 మంది (పురుషులు 3,280, మహిళలు 2,772)గా ఉన్నారు. 18-19 ఏండ్ల వయస్సు ఓటర్లు 6,106 మందిగా నమోదయ్యారు. మొత్తం వికలాంగ ఓటర్లు 1,891 మంది ఉన్నారు. వీరిలో చూపులేని వారు 519 మంది, శారీరక వైకల్యం ఉన్న వారు 667 మంది, వినికిడి లోపం ఉన్న వారు 311 మంది, ఇతర వైకల్యాలు కలిగిన వారు 722 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 95 మంది ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.



