కార్పొరేట్ల ప్రయోజనాలకే ఆధునిక మీడియా ప్రాధాన్యం
డిజిటల్ రంగంలో మరింత మెరుగవ్వాలి
భావజాల వ్యాప్తిలో మీడియా, సోషల్ మీడియా, పుస్తకాలదే కీలకపాత్ర : నవతెలంగాణ దినపత్రిక వర్క్‌షాప్‌లో బీవీ.రాఘవులు
రిపోర్టర్లకు, క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆధునిక మీడియాలో ఎక్కువ పత్రికలు కార్పొరేట్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుండటం పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రజల కోసం పనిచేస్తున్న నవతెలంగాణ లాంటి పత్రికలను బతికించుకోవాల్సిన బాధ్యత రిపోర్టర్లు, సిబ్బందిపైనే ఉందని చెప్పారు. పెద్దపెద్ద పత్రికలకు వనరులు సమకూర్చేవారు వేరేగా ఉంటారనీ, అవసరాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం అవి నడుస్తాయని వివరించారు. వాటి పాత్రకు విభిన్నంగా నిబద్ధతతో పనిచేస్తున్న నవతెలంగాణ సిబ్బందికి అభినందనలు తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, పుస్తకాల ద్వారా వామపక్ష భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత, జరుగుతున్న కృషి గురించి వివరించారు.
ఆయా రాష్ట్రాల్లోని పలు పత్రికలతో సమన్వయం చేసుకోవడం, అన్ని పత్రికలకూ నిర్ధిష్టమైన సమాచారం అందేలా కేరళలోని దేశాభిమాని పత్రిక నేతృత్వంలో ఒక న్యూస్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలను చైతన్యపర్చే పుస్తకాలు మరింత రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పలు పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయాల సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ నెల 30న చెన్నైలో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిపారు. సోషల్‌మీడియా ప్రాధాన్యత రోజురోజుకీ పెరుగుతున్నదన్నారు. ఆ రంగంలో మరింత రాణించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రజలను చైతన్యపర్చడంలోనూ, భావజాల విస్తరణలోనూ మీడియా, సోషల్‌మీడియా, పుస్తకాలు చాలా కీలకమని సీపీఐ(ఎం) భావిస్తోందన్నారు. ఆధునిక మీడియాలో ప్రజల సమస్యల కన్నా, అభివృద్ధి కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకు, క్రోనీ క్యాప్టలిజానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న తీరును ఎండగట్టారు.
అంబానీ, ట్రంప్ లాంటి వ్యక్తులకు అనుకూలంగా పత్రికలు వార్తలు రాయటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీకి లబ్ది చేకూరేలా పలు మీడియా సంస్థలు విద్యుత్‌పై కథనాలు ప్రచురితం, ప్రసారం చేస్తున్న తీరును వివరించారు. రంగులు ఆర్భాటాలు కాదు ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత నవతెలంగాణ లాంటి పత్రికలపై ఉందని నొక్కిచెప్పారు. పత్రికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేస్తున్న పలువురు రిపోర్టర్లకు రీజియన్లవారీగా బహుమతులను అందజేశారు. నవతెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన వెబ్‌టీమ్‌కు, రన్నరప్‌గా నిలిచిన బ్యూరో టీమ్‌కు షీల్డ్స్, బహుమతులను రాఘవులు అందజేశారు.




