ఎలాంటి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయదు : పీయూశ్ గోయల్
న్యూఢిల్లీ : భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలులుగా ఒత్తిడి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ప్రధాని మోడీ రష్యా నుంచి కొనుగోలును నిలిపివేతకు అంగీకరించినట్టు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలును నిలివేయడం లేదని, భారత్ తొందరపడి ఎటువంటి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖా మంత్రి పీయూశ్ గోయల్ శుక్రవారం స్పష్టం చేశారు. అమెరికాతో సహా ప్రధాన భాగస్వాములతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య ఎంపికలను పరిమితం చేసే భాగస్వామి దేశాల షరతులను భారత్ తిరస్కరిస్తుంది అని పీయూశ్ గోయల్ అన్నారు. కేంద్రమంత్రి బెర్లిన్ అధికారిక పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన గ్లోబల్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మార్కెట్‌పరంగానూ, పర్యావరణ ప్రమాణాలు, వాణిజ్య నియమాలపై విభేదాలు ఉన్నప్పటికీ.. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ చర్చలు జరుపుతోంది. భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలను విధించిన అమెరికా, ఇతర దేశాలతో కూడా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని భారత్‌పై ఒత్తిడి చేస్తున్నాయి. చమురు కొనుగోలు ద్వారా భారత్ అందించే నిధులు.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికే సాయపడతాయని, ఆ యుద్ధం మరింతకాలం సాగే అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు భారత్‌పై ఆరోపిస్తున్నాయి’ అని ఆయన అన్నారు. వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలికమైనవి. భారత్ విధానం దీర్ఘకాలిక దృక్పథంతో నడిచేది. తక్షణ వాణిజ్య లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడి ద్వారా కాదు. సుంకాలు మోపిందని తాత్కాలిక ఒప్పందాలు చేసుకోవడం కాదు. వాణిజ్య ఒప్పందాలంటే.. నమ్మకం, ఇరుదేశాల మధ్య సంబంధాలు, వాపారాలు కూడా అని పీయూశ్ గోయల్ తెలిపారు.



