Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంపారిశ్రామిక హబ్‌గా కేరళ

పారిశ్రామిక హబ్‌గా కేరళ

- Advertisement -

మరో ఆరేండ్లలో అభివృద్ధి చెందిన రాష్ట్ర హోదా
పారిశ్రామికాభివృద్ధి విధాన పత్రాన్ని తీసుకువచ్చిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం

తిరువనంతపురం : కేరళ రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు ఉద్దేశించి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి విధాన పత్రాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 200 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, 1700 ఎకరాల్లో విళింజం-కొల్లాం-పనలూర్‌ గ్రోత్‌ ట్రయాంగిల్‌, 358 ఎకరాల్లో కోచి గ్లోబల్‌ సిటీ ప్రాజెక్టు, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం నమూనాతో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీ, కొల్లామ్‌లో మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ వంటి మెగా ప్రాజెక్టులపై ఈ డాక్యుమెంట్‌ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
‘విజన్‌-2031’ పేరుతో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి సెమినార్‌లో మంత్రి పి.రాజీవ్‌ ఈ విధాన పత్రాన్ని సమర్పించారు.

2031కల్లా కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యంగా వుంది. 2031నాటికి కేరళ రాష్ట్రం ఏర్పడి 75ఏండ్లు పూర్తవుతుంది, అప్పటికల్లా భవిష్యత్‌ అభివృద్ధి లక్ష్యాలను రూపొందించుకోవడంలో భాగంగా ఈ విధాన పత్రాన్ని సెమినార్‌లో ప్రవేశపెట్టారు. విళింజమ్‌ పోర్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధిపరచాలంటే విళింజమ్‌ అభివృద్ధి కారిడార్‌ సాకారం కావాల్సి వుంది. పోర్టు ఆధారంగా పారిశ్రామిక ఆర్థిక పర్యావరణవ్యవస్థను అభివృద్ధిపరచడంలో భాగంగా విళింజమ్‌-కొల్లామ్‌-పనలూర్‌ గ్రోత్‌ ట్రాయాంగిల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హై టెక్‌ సెంటర్లకు అంతర్జాతీయ కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు 200 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు ఉద్దేశించబడ్డాయి.

రాష్ట్రంలోని యువతను భవిష్యత్తులో పారి శ్రామిక అవసరాలు తీర్చే విధంగా రూపుదిద్దేందుకు గానూ ప్రభుత్వం, ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. కోచి-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా 358 ఎకరాల్లో కోచి గ్లోబల్‌ సిటీ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. దీనివల్ల 1.20 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 3.6లక్షల ఉద్యోగాలు రానున్నాయి. తిరువనంతపురంలో విఎస్‌ఎస్‌సి, ఇస్రో సమీపాన ఏరో డిఫెన్స్‌, డ్రోన్‌ ఇండిస్టియల్‌ క్లస్టర్‌ నెలకొల్పనున్నారు. కొజికోడ్‌-మలప్పురం పారిశ్రామిక క్లస్టర్‌లో భాగంగా బయోటెక్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కేంపస్‌, ఇఎస్‌డిఎం(ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌), పవర్‌ ఎలక్ట్రానిక్‌ కేంపస్‌లు ఏర్పాటు చేస్తారు. బహుళ రంగాల మెగా ప్రాజెక్టు ఎరెనా మలబార్‌లో క్రీడలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులు వుంటాయి.

కన్నూర్‌-కాసర్‌గోడ్‌ పారిశ్రామిక కారిడార్‌లో ఫిన్‌టెక్‌, ఐటీఈఎస్‌ (ఐటీ ఆధారిత సేవలు), ఏఐ, రోబొటిక్స్‌, జౌళి, మౌలిక ప్రాతిపదిక రంగాలు వుంటాయి. కొల్లామ్‌లో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే అలప్పూజలో మెరైన్‌ పార్‌్‌క, తిరువనంతపురంలో 500 ఎకరాల్లో మెడికల్‌ బయోటెక్‌ హబ్‌, కొట్టాయంలో 2వేల ఎకరాల్లో చిన్న తరహా పారిశ్రామిక నగరం ఏర్పాటు వంటి ప్రాజెక్టులను చేపట్టాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. త్రిస్సూర్‌లో రోబొటిక్స్‌ పార్‌్‌క, రత్నాలు, ఆభరణాల పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాయనాడ్‌ కాఫీ పార్‌క, పాలక్కాడ్‌ గ్రాఫెన్‌ అరోరా పార్క్‌లను కూడా ఏర్పాటు చేయతలపెట్టారు. కోచి, తిరువనంతపురంల్లో 2031కల్లా గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ ప్రాజెక్టు అమలవుతుందని విధాన పత్రం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -