హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 14.5 శాతం వృద్ధితో రూ.1,437 కోట్ల నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. బ్రాండెడ్ మార్కెట్‌లో మెరుగైన అమ్మకాలు అధిక లాభాలకు దోహదం చేశాయని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ కంపెనీ 2024-25 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,255 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.8,016 కోట్ల రెవెన్యూ నమోదు చేయగా.. గడిచిన క్యూ2లో రూ.8,805 కోట్ల రెవెన్యూ సాధించింది. నార్త్ అమెరికా అమ్మకాలు 13 శాతం తగ్గి రూ.3, 241 కోట్లుగా, యూరప్ రెవెన్యూ దాదాపు రెట్టింపై రూ.1,376 కోట్లుగా చోటు చేసుకుంది. భారత రెవెన్యూ 13 శాతం పెరిగి రూ.1,578 కోట్లకు చేరింది.



