నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) జిల్లా కార్యాలయం, నాందేవాడా లో ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వేలాది మంది రైతుల ధాన్యం తడిసి పాడవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు తమ కష్టార్జిత పంటలను రక్షించుకునే స్థితిలో లేరని, వర్షంలో ధాన్యం నానిపోవడంతో తీవ్రమైన అయోమయం నెలకొన్నదని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా ఇవ్వాలని, ప్రతి రైతు దగ్గర నుంచీ ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని అన్నారు. అదనంగా, ధాన్యం నిల్వ చేసేందుకు ప్రత్యేకమైన గోదాములు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.500 బోనస్ హామీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు అనిల్, గోపాల్, సయ్యద్ రఫీ దిన్ వర్మయశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.



