చెట్లు, పుట్టలు… కిలకిలలాడే పక్షులు… కొండలు, కోనలు… వాగులు, గుట్టలు… సాధు జంతువులు, క్రూరమగాలు. వీటితో మమేకమైనవే గిరిజనుల జీవితాలు. మట్టిఇళ్లు. మసకబారిన జీవితాలు. నెత్తిపై తట్ట పెట్టుకుని అడివిలోకి వెళ్లి పూలో, పండ్లో ఏరుకోవడం, కడుపు నింపుకోవడానికి చేతనైన వ్యవసాయం చేసుకోవడం. చీకటిపడ్డాక డోలు, డప్పులతో ఆట, పాట. చదువు, విజ్ఞానం, సాంకేతికత, అభివద్ధి ఇవేవీ వారి దాకా చేరని అంశాలు.
కాని ఒడిశా ఆదివాసీల జీవితాల్లో మార్పువచ్చింది. వారికళ్లల్లో తమబిడ్డల భవిష్యత్తుపై కోటిఆశలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే గత మూడు దశాబ్దాల నుంచి కళింగ సోషల్ సైన్సెస్ (కిస్), వారి జీవితాల్లోకి విద్య అనే వెలుగును తీసుకువచ్చింది. ప్రస్తుత విద్యార్థులతో కలిపి మొత్తం 80,000 మంది విద్యార్థులు ‘కిస్’ నుంచి ఉచితవిద్య అందుకున్నారు.
ఒడిశా
ఈ పేరు వింటే కోణార్క్ సూర్యదేవాలయం, జగన్నాధుడి మందిరం, ఒడిస్సీ నత్యం, ఫెలిగ్రీ నగలు, సౌర పెయింటింగ్లు, సంబల్పురి చీరలు ఇవి గుర్తొస్తాయి కదూ. అలానే బాగా వెనకబడిన రాష్ట్రం అనే ముద్ర కూడా. భారత తూర్పు తీరంలో ఉన్న ఒడిశా, సంస్కతి, సంప్రదాయాలు ఘనంగా కలిగిన రాష్ట్రం. ఆదివాసీల సంఖ్య దాదాపుగా 9,590,756. దేశంలోనే అత్యధికంగా 23 శాతం ఆదివాసీలను కలిగి ఉండటం వలన ప్రకతికి, పచ్చదనానికి, దగ్గరగా ఉంటుంది. ఇక్కడ 62 గుర్తింపు పొందిన తెగలు నివసిస్తున్నాయి. అందులో 13 తెగలు అత్యంత వెనకబడి ఉన్నాయి. సహజ వనరుల ఆధారంగా నిర్మించుకున్న జీవన విధానం వీరిది. విభిన్నమైన భాషలు, ప్రత్యేక ఆచారాలు వీరివి. మహువా పువ్వులు, తాటిచెట్లు, వన ఉత్పత్తులు వీరి ఆర్థిక మూలాలు. పండుగలు, నత్యాలు, పాటలు వారి ప్రత్యేకత. ఆదివాసీలు నాగరికత తెలియని అమాయకులు. బయటి ప్రపంచం అభివద్ధివైపు పరుగులు తీస్తుంటే వీరు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందక అన్ని విధాల వెనకబడి ఉంటారు. కాని పరిస్థితులు క్రమంగా మారుతూ వచ్చాయి. ఆదివాసీలు మెరుగైన జీవనాన్ని అనుభవించ గలుగుతున్నారు.
ఇప్పటికీ ఒడిశాలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగానే జీవిస్తున్నారు. వరి, పప్పులు, నువ్వులు, జూట్, చెరకు ప్రధాన పంటలు.విద్య, ఆరోగ్యం, మహిళాసాధికారత, పర్యావరణ పరిరక్షణ అన్నింటిలోనూ ముందుకు సాగే ప్రయత్నంలో ఉంది. అడివి బిడ్డలు చదువుల్లో, క్రీడారంగంలో రాణిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆధునిక సాగు విధానాల వలన రైతుల ఆదాయం పెరుగుతోంది. ఆదిజాతుల సంక్షేమం కోసం రాష్ట్రాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. కాని సాధారణంగా ఇంత పెద్ద గిరిజన కమ్యూనిటీ అభివద్ధికి కేవలం ప్రభుత్వ సహకారం చాలదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వాటి ప్రభావం నిజంగా వారి వరకు చేరడం కష్టమే. అందువలననే కళింగ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు ఒడిశాకు అభివద్ధినే కాదు ప్రత్యేక స్థానాన్ని తెచ్చి పెడుతున్నాయి. కిస్, గిరిజన బాలబాలికలకు విద్య అందించడం వలన ఒడిశా ఒక మోడల్ రాష్ట్రంగా నిలుస్తోంది. ఈ విద్యా సంస్థ వలన పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ రేటుపెరుగుతోంది. డ్రాపవుట్ రేట్ తగ్గుతోంది. ఎక్కడ చదువు ఉంటుందో అక్కడ అభివద్ధి తథ్యం.
గిరిజన విద్యాలయం అందిచే కోర్సులు
ఉచితవిద్యాసేవలు: కెజి నుంచి పిజి వరకు పూర్తి ఉచిత విద్య. కిస్వెర్నాక్యులర్స్కూల్ (1-10 వతరగతి). ఒడిశా కౌన్సిల్ ఆఫ్ హయర్ సెకండరి (12వతరగతి). కిస్ – సిబిఎస్‌ఇ (1-8వతరగతి). ట్రైబల్ యూనివర్సిటీీ ద్వారా యుజి, పిజి, ఇంకా పిహెచ్‌డి ప్రోగ్రాములు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒడియా, ఇంకా ఇంగ్లీషు భాషలలో మద్దతు.
ఉచిత నివాస, భోజన సౌకర్యాలు: ఆడపిల్లలు, మగపిల్లలకు వేర్వేరు హాస్టల్స్. పిల్లల వయసుకు, అవసరానికి తగినట్లు శక్తిమంతమైన ఆహారం. వారి పరిశుభ్రతకు, భద్రతకు ప్రత్యేక ప్రణాళికలు
వత్తిశిక్షణ, నైపుణ్యాల అభివద్ధి ఫ్యాషన్ డిజైన్, కంప్యూటర్, హ్యాండిక్రాఫ్ట్, ఆగ్రో బిజినెస్, మార్కెట్‌కి అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాములు, స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మార్గదర్శకత్వం. సాంస్కతిక, సామాజిక సేవలు గిరిజన అమ్మాయిలు, అబ్బాయిలకు సంప్రదాయ నత్యాలు, సంగీతంలో శిక్షణ, ట్రైబల్ ఆర్ట్స్, ఫెయిర్స్, పండుగలను కాపాడే కల్చర్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాములు, సామాజిక సేవ చేయడానికి లీడర్షిప్ ట్రెయినింగ్.
ప్రత్యేక అవకాశాలు
స్కాలర్‌షిప్‌లు, ఉన్నత చదువులకు సహకారం. ట్రైబల్పరిశోధనావకాశాలు. ట్రైబల్ స్టడీస్, స్థానిక భాషలు, కళలు, సుస్థిర అభివద్ధికి సహాయసహకారాలు
క్యాంపస్ సౌకర్యాలు: ఆధునిక తరగతిగదులు, ప్రయోగశాలలు, రోజుకి 30000 మందికి పైగా విద్యార్థులకు భోజనాలు అందించే సామర్థ్యం. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పోటీకి విద్యార్థులను సిద్ధం చేసే విశాల ఆటస్థలాలు.
ఆరోగ్యం, పోషణ : గిరిజన పిల్లల్లో సాధారణంగా ఉండే పోషకాహార లోపం, మలేరియా రక్తహీనతకు కళింగ ఇన్స్టిట్యూట్‌ఆఫ్ మెడికల్ లైన్సెన్స్‌తో ఆరోగ్య సేవలు.
గిరిజన విద్యాలయానికి నాంది ఇలా…
‘కిస్’ఫౌండర్ ప్రొఫెసర్ అచ్యుత సమంత. ప్రతి ఆదిజాతి పిల్లల్లో ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం ఉంటుంది. కేవలం అది సరైన దిశలో పరిగణించాలని నమ్ముతారు. ఈయన ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, ఇంకా చాలా కొద్దిసంవత్సరాలు ఎం.పి.గా పనిచేశారు. ఒడిశాలోని కలరాబంక ఒక పేద కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుంచే ఆదివాసీలకు, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు విద్య అందుబాటులో లేని పరిస్థితులను చూశారు. విద్య అంటే మార్పు. కేవలం చదువు మాత్రమే పేదల జీవితాలను మార్చగలిగిన అస్త్రం అని నమ్మారు. తన 25 ఏళ్ల వయసులో విద్యారంగంలో సేవచేయాలనే ఉద్దేశ్యంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే విద్యాసంస్థను 1992 లో ఆరంభించారు.
ప్రత్యేకంగా గిరిజనులకు కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం 1993లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) ఆరంభించారు. 125 మంది పిల్లలతో ఆరంభమైన కిస్ ఇంతింతై వటుడింతై మాదిరి పెరిగి గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపుతూ వస్తోంది. ఉచిత విద్య, ఉచిత నివాసం అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత నివాస విద్యాసంస్థగా గుర్తింపుకు నోచుకుంది. కిస్ ద్వారా చదువుకున్న ఆదివాసీ పిల్లలు జాతీయ అంతర్జాతీయ వేదికలలో తమ సత్తా చూపుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, వత్తి లోపం నుండి బయటకు వచ్చి స్వావలంబన సాధిస్తున్నారు. విద్యారంగంలో, క్రీడల్లో, సాంస్కతిక కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఆదీవాసీల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో కిస్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆదివాసీ పిల్లలకు సమాన అవకాశాలు అందించడమే ఈ విద్యాసంస్థ లక్ష్యం.
చదువే కాదు సంస్కతి కూడా
గిరిజనుల్లో మగపిల్లలు సాధారణంగా వ్యవసాయం, వనరుల ఆధారిత ఉపాధిపై ఆధార పడుతుంటారు. పేదరికం, స్థిరమైన ఉపాధిలోపం వారికి సవాళ్లు. అయినా ఒడిశా అంతటి నుంచి వేలాది ఆదిజాతి అబ్బాయిలు క్యాంపస్‌లో నివసిస్తూ చదువుకుంటున్నారు. అబ్బాయిలకు హయర్ సెకండరీ, అలాగే అండర్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ అందుబాటులో ఉన్నాయి. కిస్‌లో చదువుకున్న ఆధునికవిద్యలో మరింత చేరువవుతున్నారు. కిస్‌లో విద్యా ప్రణాళిక కేవలం పాఠ్యపుస్తకాల మీద మాత్రమే కాదు, నేతత్వం, సాంస్కతిక పరిరక్షణ, క్రీడలు, సామాజిక బాధ్యతలలో కూడా శిక్షణ ఇస్తారు. అలాగే తమ సొంత తెగకు చెందిన సంప్రదాయాలు, కళలు, భాషలు నేర్చుకుంటూనే ప్రతిభతో ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా, కమ్యూనిటీ లీడర్స్‌గా ఎదుగుతున్నారు. కిస్ విద్యాసంస్థకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందాయి. 2017లో డీమ్డ్ యూనివర్శిటీ స్థానం దొరికింది. ఇది ప్రపంచంలోనే తొలి ఆదిజాతి విశ్వవిద్యాలయం. ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది.
దేశదేశాల నుంచి ఈ విజయవంతమైన నమూనా గిరిజన విద్యాసంస్థను సందర్శించడానికి, స్ఫూర్తిగా తీసుకోవడానికి వస్తుంటారు. అచ్యుతసామంత కషి కేవలం విద్య వరకు మాత్రమే ఆగలేదు. యువత సాధికారత, మహిళల శక్తి వద్ధి, పేదకుటుంబాల ఆర్థిక స్వావలంబనకు పలు కార్యక్రమాలు ప్రారంభించారు. యువత సామాజికంగా, బలంగా ఎదగడానికి సహాయం చేస్తున్నారు. కిస్ విద్యార్థుల్లో సగం మంది ఆడపిల్లలు. చదువు వలన బాల్య వివాహాలు తగ్గాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటితరంలో చదువుకుంటున్నవారు ఎక్కువమంది ఉంటారు. 1993లో ఆరంభమైనప్పటికీ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు 80,000 మంది గిరిజన బాలబాలికలు కిస్ ద్వారా చదువుకున్నారు. ప్రస్తుతం 30,000 మంది విద్యార్థులు భువనేశ్వర్ క్యాంపస్‌లో చదువుతున్నారు. ఒడిశా ఇంకా ఇతర రాష్ట్రాలలోని సాటిలైట్ సెంటర్లలో సుమారు 10,000 మంది పిల్లలు చదువుతున్నారు.
తమ జీవితాలకు తామే దిద్దుకునే క్రమం….
విద్య ద్వారానే కొత్తతరం మార్పు సాధిస్తోంది. పుస్తకాలు, పెన్నులు చేతబట్టి గిరిజన బాలికలు ఇప్పుడు డాక్టర్లు, ఉపాధ్యాయులు, అధికారిణులు, క్రీడాకారిణులుగా రాణిస్తున్నారు. వీరిని చూసి కొత్తతరాలు తాము కూడా అదేవిధంగా చదువుకుని పెద్దస్థాయికి చేరాలని కలలు కంటున్నారు. అయినా ఇంకా చాలా ప్రాంతాల్లో చదువు మధ్యలో మానేయడం పెద్ద సమస్యగానే ఉంది. పేదరికం, ఆరోగ్య సమస్యలు, మలేరియా, రక్తహీనత, పోషకాహారలోపం అడ్డంకులుగానే ఉన్నాయి. మూఢనమ్మకాలు, లింగవివక్ష ఇంకా వారినుంచి దూరం కాలేదు. చదువుకుంటున్న బాలబాలికలే ఆదిమవాసుల జీవితాలకు వెలుగురేఖలు కానున్నారు. ఇప్పుడు గిరిజన బాలికల కళ్లలో కొత్తవెలుగు కనిపిస్తోంది.
ఆకాశం అంచులు తాకేంత ఉత్సాహంతోఉన్నారు. ఒకప్పుడు అడవుల్లో నత్యం చేసిన కాళ్లు ప్రపంచ క్రీడామైదానంలో తమ సత్తా చూపుతున్నాయి. కేవలం రాష్ట్రం పేరునే కాదు భారతదేశం తల గర్వంగా పైకెత్తుకునే స్థాయిలో ఇప్పుడు గిరిజన బాలబాలికలు తమ ప్రతిభను చదువుల్లో, ర్యాంకులు సాధించడంలో చూపించడం దేశానికి గర్వకారణం. చదువుకున్న గిరిజన మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తాగుడు, ఇంకా ఇతర వ్యసనాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు
ప్రయాణం ఇంకా మధ్యలోనే ఉంది
ఆదివాసేతరులతో పోల్చుకుంటే ఆదివాసీలలో స్పష్టంగా అభివద్ధి లోపం, నిరక్షరాస్యత, పేదరికం, మద్యం వ్యసనం, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం వలన సాంకేతకంగా వెనుకబాటుతనం గిరిజనుల ఎదుగుదలకు అడ్డంకులు. గిరిజనులు అడవులకు కాపలా దారులు. అడివే వారి ప్రపంచం. అడివి మీద ఆధారపడే కుటుంబాన్ని పోషించుకుంటారు. వారి మాట, ఆట, పాట, కళ ఇవన్నీ బయటి ప్రపంచానికి మనదేశం గర్వంగా చూపుకునే వారసత్వ సంపద. ఈ సంపదనే కాదు ఆదివాసీల జీవితాలకు అన్ని విధాల భ్రదత ఏర్పడాలి. విద్య, వైద్యం అందాలి.
వారి సంస్కతి, సంప్రదాయాలను కాపాడుకునే తెలివి రావాలి. ప్రస్తుత తరాలు, భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉండాలి. సామాజిక స్పహ తెలియాలి. బయటి ప్రపంచంతో పోటీ పడాలి. ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వ చేయూత సరిపోదు. వేరే ఆపన్న హస్తాలు కావాలి. ఆదివాసీలకు ఆత్మబంధువులా కిస్ నిలుస్తోంది. ఆదివాసీలు అభివద్ధివైపు నడవడానికి సహకారం అందిస్తున్నారు. ఇంత ప్రయత్నం తర్వాత కూడా ఒడిశా గిరిజనుల అభివద్ధి మధ్యలోనే ఉంది. ఇంకా చాలా దూరం వెళ్లాలి.
మూడు దశాబ్దాల నుండి కిస్ అందిస్తున్న విద్యాసేవలు అందిపుచ్చుకుని గిరిజన పిల్లలు చదువుల్లో అగ్రగామిగా నిలుస్తున్నారు. గిరిజన యువతులు రగ్బీ, అథ్లెటిక్స్, హాకీ వంటి క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రతిభ చూపిస్తున్నారు. ఇది కిస్ విద్యార్థుల వ్యక్తిగత విజయం మాత్రమే కాదు గిరిజన మహిళల సామర్థ్యానికి ప్రతీక. వేలమంది పిల్లలు ధైర్యంగా, స్థిరంగా తమ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నారు.
జానకి ముర్ము : భారతదేశం తరపున అండర్ 14 ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో 2015 నేపాల్లో పాల్గొంది. జాతీయ పోటీల్లో పాల్గొని రాష్టానికి మెడల్ తెచ్చింది.
గీతాభుయాన్ : బేస్‌బాల్ వలర్డ్ కప్ 2016లో 12 దేశాలతో తలపడటానికి భారతదేశం నుంచి వెళ్లిన అథ్లెట్లలో ఈమె ఒకరు. బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకుంది.
సౌన్రి హన్స్డా : సంథాల్ తెగకు చెందిన మొదటితరం చదువుకున్న అమ్మాయి. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్‌లో చదువుకుంది. నీట్‌లో ఉత్తీర్ణత పొంది గైనకాలజీలో సీటు సంపాదించింది.
లక్ష్మణ్ హెంబ్రమ్ : సంథాల్ తెగకు చెందిన అబ్బాయి. ప్రతిష్టాత్మక అమెరికా మైక్రో స్కాలర్ షిప్‌ప్రోగ్రామ్‌కు ఎన్నికయ్యాడు. వాతావరణంలో మార్పుల మీద తాను రాసిన పేపర్ ప్రెజెంట్ చేయడానికి వివిధ దేశాలకు వెళ్లాడు. మలాలా యూత్ సెషన్లో పాల్గొనడానికి ఐక్యరాజ్యసమితి లక్ష్మణ్‌ను ఎంచుకుంది.
డూటీచాంద్ : పిటి ఉష తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌ల్లో 100 మీకోవీటెడ్‌లో అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయురాలు.
సుమిత్రానాయక్ : రగ్బీఅథ్లెట్. 2013లో విమెన్స్ రగ్బీవరల్డ్ కప్, ఏసియన్ గర్ల్స్ రగ్బీసెవెన్‌తో పాటు ఎన్నో పోటీల్లో పాల్గొంది.
యామిని ఝాంకర్ : 2025 లో తన పీహెచ్‌డి పూర్తిచేసింది. చుక్టియా భుంజియా ట్రైబల్ కమ్యూనిటీ నుండి మొట్టమొదటి రీసెర్చ్ స్కాలర్. ఆయుర్వేదిక్ మెడిసిన్ మీద పరిశోధన చేసింది. ఆదివాసీ ప్రతిభ లాటి ఎన్నో అవార్డులు అందుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము నుంచి కూడా అవార్డు అందుకుంది.
ఫౌండర్ ప్రొఫెసర్ అచ్యుత సమంత
గత 33 ఏళ్లగా అచ్యుతసమంత ఆరంభించిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్ (కిస్) ఆదివాసీ పిల్లలకు కెజి నుండి పీజి దాకా ఉచితంగా చదువు, రెసిడెన్షియల్ సదుపాయాలు ఇస్తోంది. ఇప్పటికి 80,000 మంది ఆదివాసీ పిల్లలను విద్యావంతులను చేసింది. ఇప్పుడు కిస్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన విశ్వవిద్యాలయం. ఇది కేవలం విద్యాసంస్థ కాదు, ఒక సామాజిక ఉద్యమం. యూనిసెఫ్, యునెస్కో అభినందనలు పొందింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఒడిశా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. సాధికారత సాధిస్తున్న గిరిజన బాలికలు, ఆత్మస్థైర్యంతో సాగుతున్న గిరిజన బాలురు దేశానికే అభివద్ధి నమూనాలుగా నిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
ఒక్కోతెగ… ఒక్కోతీరు
బొండా– మహిళలు రాగిమాలలు, రంగురంగుల మణులు ధరిస్తారు. సౌర మహిళలు గోడలపై చిత్రాలు గీస్తారు. గడబా మహిళలు ధిమ్సా నత్యంలో అడుగులు వేస్తారు. ప్రతి తెగకు వారి వేషం, భాష, నత్యం, నడక అన్నీ ప్రత్యేకమే.
కాంథా – కాంథామరి, రాయగడ, కోరాపుట్, బాలనగరి, బౌధి జిల్లాల్లో నివసిస్తారు. కుయి భాష మాట్లాడతారు. సొహ్రాజ్, సార్హుల్, జితియా, ఫాగుకర్మ, నవాఖాని పండగలు జరుపుకుంటారు. చిరుధాన్యాలు పండిస్తారు.
సంథాల్ – మయూర్భంజి జిల్లాలో నివసిస్తారు. మొక్కజొన్న పండిస్తారు. సంథాలి భాష మాట్లాడతారు. సంథాల నృత్యం వీరి ప్రత్యేకం.
సవోరా – గంజం, పూరి జిల్లాల్లో నివసిస్తారు. వరి, మొక్కజొన్న పండిస్తారు. సవోరా భాష మాట్లాడతారు. సవోరా పెయింటింగ్స్ వీరి కళ.
ముందా– సుందేర్గఢ్, ఝార్సుగూడా, సంబల్పురి జిల్లాల్లో నివసిస్తారు. ముందా భాష మాట్లాడతారు. ముందా నత్యం వీరి ప్రత్యేకం.
ఓరవోన్ – సుందర్గడ్‌లో నివసిస్తారు. వీరి భాష, నత్యం పేరు కూడా ఓరావోన్నే.
కిసాన్ – సుందర్గఢ్, సంబల్పుర్, కియోంఝారి జిల్లాల్లో నివసిస్తారు. కిసాన్, ఒడియా, సంబలురి భాషలు మాట్లాడతారు.
భుంజియా – నువాపడా జిల్లాల్లో నివసిస్తారు. భుంజియా, ఛత్తీస్గఢ భాషలు మాట్లాడతారు.
భోట్టాడ– ఒడిశా ఇంకా ఛత్తీస్‌ఘడ్ జిల్లో నివసిస్తారు. భత్రీ, ఒడియా భాషలు మాట్లాడతారు.
లోధా– మయూర్భంజి జిల్లాల్లో నివసిస్తారు. లోధా, ఒడియా భాషలు మాట్లాడతారు.
మాంకిడి – కోరాపుటి జిల్లాలో నివసిస్తారు. మాంకిడి, ఒడియా భాషలు మాట్లాడతారు.
గడబా– కోరాపుటి జిల్లాలో నివసిస్తారు. గడబా, ఒడియా భాషలు మాట్లాడతారు.
ఖారియా – మయూర్భంజి జిల్లాలో నివసిస్తారు. ఖారియా, ఒడిశా భాషలు మాట్లాడతారు.
కుటియాకోంధ్ – కంధమలి జిల్లాలో నివసిస్తారు. కుయి భాష మాట్లాడతారు.
లాంజియాసవోరా – గంజామి జిల్లాలో నివసిస్తారు. సవోరా భాష మాట్లాడతారు. లాంజియా సవోరా పెయింటింగ్స్ వీరి ప్రత్యేకం
పౌడిభుయాన్ – కంధమలి జిల్లాలో నివసిస్తారు. కుయి భాష మాట్లాడతారు.
సౌరా– మయూర్భంజి జిల్లాలో నివసిస్తారు. సౌర భాష మాట్లాడతారు.
శ్రీదేవి కవికొండల
7799821144



